కుందుర్పి: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. అపరిమిత దాహంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నెరవేర్చకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే కుందుర్పి మండలం జంబుగుంపల, కదరంపల్లి గ్రామాల్లో 20 రోజులుగా ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సమస్య జఠిలమైనట్లు గ్రామస్తులు ఆంజనేయులు, మారెన్న, తిప్పేస్వామి, గోవిందు తదితరులు వాపోయారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అమిలినేని దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగ ఉండడంతో గురువారం జంబుగుంపల పంచాయతీ అధికారులు రెండు రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. అవి ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని అంటున్నారు.


