● మొదటి దశలో గృహ గణన
● ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకూ సేకరణ
● రెండో దశలో జనాభా గణన
అనంతపురం అర్బన్: జన గణన (2027)లో భాగంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో గృహ గణన ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకూ దీన్ని నిర్వహించనున్నారు. తర్వాత రెండో దశలో జనాభా గణన నిర్వహిస్తారు. జన గణన నిర్వహణలో భాగంగా మొదటి విడత గృహ గణనలో సేకరించిన వివరాలను కంప్యూటర్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా నమోదు చేయడంపై ఇప్పటికే 200 మందికి శిక్షణ ఇచ్చారు. ఇదే క్రమంలో మండల, సచివాలయ స్థాయి సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేశారు. జన గణన ద్వారా సేకరించే గణాంకాల ఆధారంగా గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయస్థాయిలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన చేస్తారు.
గృహ గణనలో...
మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (హెచ్‌ఎల్‌ఓ) చేపడతారు. గృహగణన ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇళ్లకు సంబంధించి డేటా సేకరిస్తారు. ఇంటి కట్టడం నిర్మాణం మొదలు ప్రతి వివరాన్ని నమోదు చేస్తారు.
● గుర్తించిన గృహానికి ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారు. ఇంటిలో నివసించే సభ్యుల వివరాలు నమోదు చేస్తారు.
● గృహ గణనలో భాగంగా మౌలిక సదుపాయాలు, గృహోపకరణాలు నమోదు చేస్తారు.
● ఫొన్లు, ఇంటర్నెట్, వాహనాలు నమోదు చేస్తారు.
● ఇంటి కట్టడం తీరు, ఫ్లోరింగ్, తాగునీటి వినియోగం, మరుదొడ్ల వాడకం నమోదు చేస్తారు.
● విద్యుత్ వినియోగం, నెలవారీ బిల్లు, విద్యుత్‌తో పనిచేసే పరికరాలు (ఏసీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్లు, గీజర్, తదితర వివరాలను నమోదు చేస్తారు.
● సేకరించిన వివరాలను కంప్యూటర్ మెయింటేనెన్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎంఎస్) ద్వారా నమోదు చేస్తారు.
సెన్సెస్ నిర్వహణకు...
జిల్లాస్థాయిలో కలెక్టర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. అదనపు సెన్సెస్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఉంటారు. జిల్లా సెన్సెస్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తారు. నగర పాలక సంస్థ, మునిసిపాలిటీల్లో కమిషనర్లు ముఖ్య సెన్సెస్ అధికారిగా ఉంటారు. మండలస్థాయిలో తహసీల్దార్లు సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయిలో సెన్సెస్ వివరాలను సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు సేకరిస్తారు.


