రైతులకు అకాల వర్షం దెబ్బ | - | Sakshi
Sakshi News home page

రైతులకు అకాల వర్షం దెబ్బ

Mar 20 2026 8:18 AM | Updated on Mar 20 2026 8:18 AM

అనంతపురం అగ్రికల్చర్‌: అకాల వర్షాలు రైతులను మరింత నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. గాలి వాన బీభత్సానికి కోతకు వచ్చిన అరటి తోటలు నిలువునా కూలాయి. అలాగే తీగజాతి కూరగాయ పంటలు, వరి, మొక్కజొన్న పంటలకు కూడా తీరని నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అలాగే అక్కడక్కడా వడగళ్లతో కూడిన వర్షాలు నమోదు కావడంతో భారీగా పంట నష్టం జరిగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పలు మండలాల్లో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నార్పలలో 46.6 మి.మీ, రాప్తాడు 36.2, బుక్కరాయసముద్రం 29, బెళుగుప్ప 28.6, గుంతకల్లు 16.2, పామిడి 15.3, కణేకల్లు 13, ఆత్మకూరు 12.2, గార్లదిన్నె 11.4, యల్లనూరు 11.2 మి.మీ వర్షం కురిసింది. 24 మండలాల పరిధిలో 8.6 మి.మీ సగటున అకాల వర్షం కురిసింది. రెండు రోజుల్లోనే జిల్లా రైతులకు రూ.5 కోట్లకు వరకు పంటనష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.

● రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి వద్ద గాలివానకు దాదాపు 150 ఎకరాల్లోని అరటి తోటలు దెబ్బతిన్నాయి. రైతులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది.

● కణేకల్లు మండలంలో బుధవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కణేకల్లు క్రాస్‌, ఆలూరు, గోపులాపురం గ్రామాల్లో అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది.

● అకాల వర్షాలతో శింగనమల, నార్పల మండలాల్లో అరటి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.

కూడేరు: మండలంలో బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు ముద్దలాపురంలో కారు మనిషి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల్లో సాగు చేసిన అరటి పంట, కడదరకుంటలో సరోజమ్మకి చెందిన నాలుగు ఎకరాల్లోని అరటి పంట నేలకొరిగింది. అలాగే చోళసముద్రం, మరుట్ల, గొటుకూరు, జల్లిపల్లి, కలగళ్ల తదితర గ్రామాల్లో కూడా అరటికి నష్టం వాటిల్లింది.

అరటి, వరి, మొక్కజొన్న

పంటలకు తీరని నష్టం

దాదాపు రూ.5 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement