● వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవంలో
పాల్గొనకూడదంటూ నేతలకు హుకుం
● నాయకులపై బూతులతో రెచ్చిపోయిన వైనం
తాడిపత్రిటౌన్: తాడిపత్రి సీఐ ఆరోహణరావు ఓవరాక్షన్ చేశారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఆయన వ్యవహ రించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనకూడదంటూ పార్టీ తాడిపత్రి పట్టణ కన్వీనర్ రాబర్ట్, రూరల్ కన్వీనర్ విజయ్‌కాంత్‌రెడ్డి, మాజీ మార్కెట్‌యార్డ్ వైస్ చైర్మన్ ఓబులరెడ్డికి సీఐ ఆరోహణరావు హుకుం జారీ చేశారు. బుధవారం రాత్రి పోలీసులు వారికి ఫోన్లు చేసి హెచ్చరికలు చేశారు. ఆ ముగ్గురు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్దకు రాకుండా గురువారం ఉదయం నుంచే పోలీస్ బలగాలతో సీఐ కాపు కాశారు. అయితే వారు అంతకు ముందే పార్టీ కార్యాలయానికి చేరుకున్నా రని తెలుసుకున్న ఆయన.. అనంతరం నేతలు స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందంటూ సీఐ ఆరోహణరావు రెచ్చిపోయారు. కొంత మంది వైఎస్సార్‌సీపీ నాయకులను దుర్భాషలాడారు.‘ముందుకు వెళ్లండిరా రేయ్’ అంటూ నాయకులను దూరంగా పంపించివేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుల పట్ల సీఐ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.


