రాయల్‌ మధుపై చర్యలు తీసుకోవాల్సిందే | - | Sakshi
Sakshi News home page

రాయల్‌ మధుపై చర్యలు తీసుకోవాల్సిందే

Mar 13 2026 7:54 AM | Updated on Mar 13 2026 7:54 AM

టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును డిమాండ్‌ చేసిన మైనార్టీలు

అనంతపురం టౌన్‌: టీడీపీ మైనార్టీ నాయకుడు నూర్‌ మహమ్మద్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన అదే పార్టీకి చెందిన రాయల్‌ మధుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును మైనార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. పూల నాగరాజుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఇఫ్తారు విందు ఏర్పాటు చేస్తే చంపేస్తారా? మీ పార్టీ వైఖరి ఇదేనా? అంటూ పూల నాగరాజును నిలదీశారు. మైనార్టీల పట్ల టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకీ నగరంలో మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. మైనార్టీలకు పార్టీ వ్యతిరేకమా? అనుకూలమా? అనేది చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాయల్‌ మధును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించడంతో పాటు కేసు నమోదు చేయించాలన్నారు. నూర్‌ మహమ్మద్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించిన రాయల్‌ మధు, ఇస్మాయిల్‌, మహబూబ్‌ ఖాన్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, లేకపోతే శుక్రవారం మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తనకు రెండు రోజులు గడువు ఇవ్వాలని మైనార్టీ నాయకులను పూల నాగారాజు అభ్యర్థించారు. అయినా నాయకులు వినలేదు. రాయల్‌ మధు, ఇస్మాయిల్‌, మహబూబ్‌ ఖాన్‌పై కేసు నమోదు చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షకీల్‌ షఫీ, దాదా గాంధీ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నూర్‌ మహమ్మద్‌తో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

టీచర్లకు ‘పది’ ఇన్విజిలేషన్‌ ఉత్తర్వులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఇన్విజిలేటర్ల నియామక ఉత్తర్వులు గురువారం సాయంత్రం నుంచి జనరేట్‌ కానున్నాయి. సంబంధిత ఉపాధ్యాయులకు లీప్‌ యాప్‌ లాగిన్లలో పంపారు. కేంద్రం పేరు, ఏరోజు డ్యూటీ ఉంటుందనే వివరాలను అందులో పొందుపరిచారు. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి లాంగ్వేజ్‌ పరీక్షలకు నాన్‌ లాంగ్వేజ్‌ టీచర్లను, నాన్‌ లాంగ్వేజ్‌ పరీక్షలకు లాంగ్వేజ్‌ టీచర్లను నియమించారు. డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ లాగిన్లలో జాబితాను ప్రదర్శించినట్లు రాష్ట్ర అధికారులు ఇక్కడి అధికారులకు సమాచారం అందించారు. డ్యూటీకి నియమించిన టీచర్లకు వెంటనే సమాచారం అందించాలని సూచనలిచ్చారు. అయితే రాత్రిదాకా తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీఈఓ కార్యాలయ ఏఎస్‌ఓ శ్రీనివాసులు తెలిపారు. దీంతో గందరగోళం నెలకొంది. ఎవరికి ఆర్డరు వచ్చిందో...ఏ సెంటర్‌కు వేశారు, ఎవరికి రాలేదు, అనర్హులకు డ్యూటీలను వేశారా? అనే వివరాలు తెలియక చాలామంది టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఏదిఏమైనా శుక్రవారం ఉదయానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు

అనంతపురం టవర్‌క్లాక్‌: ఈ నెల 17న ఉమ్మడి అనంతపురం జిల్లా జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరంతరాయంగా కంప్యూటర్లపై విధులు నిర్వర్తిస్తున్న కారణంగా జర్నలిస్టులు కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మీనాక్షమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 17న అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో కంటి వైద్య శిబిరాన్ని కేవలం జర్నలిస్టుల కుటుంబాల కోసమే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, కంటి అద్దాలను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 98491 52149, 73869 58666, 80745 86699, 94900 62555 లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement