అత్తారింటి ఎదుట వివాహిత నిరసన | - | Sakshi
Sakshi News home page

అత్తారింటి ఎదుట వివాహిత నిరసన

Mar 13 2026 7:54 AM | Updated on Mar 13 2026 7:54 AM

ఉరవకొండ: తనకు తెలియకుండా తన భర్త రెండో వివాహం చేసుకుని అన్యాయం చేశాడంటూ ఓ వివాహిత తన అత్తారింటి ఎదుట గురువారం నిరసన చేపట్టింది. ఈ బాధితురాలు మలిగిలి రిజ్వానా విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లుకు చెందిన రిజ్వానాకు ఉరవకొండలోని బళ్లారి మార్గంలో నివాసముంటున్న మలిగిలి నూర్‌బాషా, ముష్కిన్‌ దంపతుల మొదటి కుమారుడు మలిగిలి షాబాజ్‌తో 2014లో వివాహమైంది. వీరికి పదేళ్ల కుమార్తె సుమేరా, ఎనిమిదేళ్ల కుమారుడు హరీష్‌ జైన్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో అదనపు కట్నం కోసం రిజ్వానాను భర్తతో పాటు అత్తామామలు వేధిస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టారు. కరోనా సమయంలో గుట్టుచప్పుడు కాకుండా కణేకల్లుకు చెందిన యువతితో 2021లో షాబాజ్‌కు అత్తామామలు రెండో పెళ్లి చేశారు. ఈ విషయం తెలుసుకున్న రిజ్వానా.. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని నిలదీసింది. దీంతో అత్తింటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరించి కాళ్లూచేతులు కట్టేసి ఇంట్లోనే నిర్బంధించారు. అయితే ఇదే విషయాన్ని తన తల్లికి, బంధువులకు తెలియజేయడంతో వారు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయం కోరుతూ రిజ్వానా కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆగ్రహించిన అత్తింటి వారు కొన్ని రోజులుగా తనను ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని, ఇంటికి తాళం వేసి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు వాపోయింది. ప్రస్తుతం తన పిల్లలకు తిండి కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. రిజ్వానా విలేకరులతో మాట్లాడుతుండగానే అత్తింటి వారు ఆమె కుటుంబసభ్యులతో గొడవకు దిగారు. ఒకానొక సమయంలో పరిస్థితి చెయ్యి దాటి పరస్పరం కొట్టుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని పీఎస్‌కు తరలించారు. రిజ్వానా అత్త ముస్కిన్‌, మామ నూర్‌బాషా మాట్లాడుతూ.. తమ కోడలు తమ పైనే తప్పుడు కేసులు పెట్టి హింసిస్తోందని, పెద్ద మనుషుల సమక్షంలోనే ఇల్లు ఇచ్చి, ప్రతి నెలా డబ్బు కూడా చెల్లిస్తున్నా దౌర్జన్యం చేస్తోందని విలేకరుల ఎదుట వాపోయారు. కాగా, ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

తనకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఆవేదన

తనను ఇంట్లోకి రానివ్వకుండా చేస్తున్నారని ఇద్దరు పిల్లలతో కలసి నిరసన

ఇరువర్గాల మధ్య

తీవ్ర ఘర్షణ – ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement