ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌గా శ్రీనివాసులు | - | Sakshi
Sakshi News home page

ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌గా శ్రీనివాసులు

Mar 13 2026 7:54 AM | Updated on Mar 13 2026 7:54 AM

అనంతపురం అగ్రికల్చర్‌: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్‌) జిల్లా మేనేజర్‌గా పి.శ్రీనివాసులు గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కె.సుబ్బయ్య బదిలీపై కాకినాడకు వెళ్లారు. ఆయన స్థానంలో విజయవాడ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న పి.శ్రీనివాసులును నియమించడంతో స్థానిక ఏపీ సీడ్స్‌ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

టీడీపీ నేతల కోడి రాజకీయం

కోడిని సాకుగా చూపి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడి

బాధితులపైనే కేసు నమోదు

కుట్రలు ఎల్లకాలం సాగవన్న వైఎస్సార్‌సీపీ నేత

కళ్యాణదుర్గం రూరల్‌: వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కళ్యాణదుర్గం మండలం కడదరకుంటలో టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారంటూ వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిని ఎరగా వేసి దాడికి పూనుకోవడమే కాకుండా బాధితులపై అక్రమంగా కేసు నమోదు చేయించి రిమాండ్‌కు పంపడం దారుణమన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పాత కక్షల నేపథ్యంలో రెండు రోజుల క్రితం కడదరకుంటకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు రామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, వారి కుటుంబసభ్యులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎర్రపరెడ్డి, సంజీవరెడ్డి, మంజులమ్మ దాడి చేశారని గుర్తు చేశారు. అయితే ఈ అంశంలో ఓ కోడిని వారు ఎరగా చూపారన్నారు. కోడిని దొంగలించారంటూ దాడికి పాల్పడడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు గుర్తింపు కోసం వెంటనే ఆస్పత్రిలో చేరి సానుభూతి పొందారన్నారు. వాస్తవాలు ఏమాత్రం పట్టని ఎమ్మెల్యే సైతం పోలీసులను ఉసిగొల్పి సూర్యనారాయణరెడ్డి, రామిరెడ్డిపై అక్రమ కేసు బనాయించి, వారిని రిమాండ్‌కు పంపడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. గతంలోనూ ఈ రెండు వర్గాల మధ్య పలుమార్లు డీలర్‌ నియమాకం విషయంలో గొడవలు జరిగాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కోడి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రలు ఎల్లకాలం సాగవని గుర్తించాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేసి అసలు దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఐ జగదీష్‌ బదిలీ

అనంతపురం సెంట్రల్‌: జిల్లా కేంద్రంలోని నాల్గో పట్టణ సీఐ జగదీష్‌ బదిలీ అయ్యారు. తిరుపతిలోని పీటీసీకి ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో గురువారం ఆయన రిలీవ్‌ అయ్యారు. దీంతో త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌కు నాల్గో పట్టణ సీఐగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

వృద్ధుడి ఆత్మహత్య

అనంతపురం సెంట్రల్‌: తాగుడు అలవాటు మానుకోలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని రాజీవ్‌ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసనాయక్‌ (60) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తాగుడు మానేయాలంటూ కుటుంబసభ్యులు పలుమార్లు నచ్చచెబుతూ వచ్చారు. తనకు కూడా తాగుడు మానేయాలని ఉందని, అయితే మద్యం తాగకపోతే తనకు ఏదోలా ఉంటుందని, అభద్రతా భావంతో నలగాల్సి వస్తోందని బాధపడేవాడు. ఈ క్రమంలోనే తాగుడు అలవాటు మానుకోలేక జీవితంపై విరక్తితో గురువారం విషపు ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

తండ్రి జ్ఞాపకాలు మరువలేక బాలిక...

తండ్రి పంచిన ప్రేమాభిమానాలు మరువలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని ఎస్‌బీఐ కాలనీలో నివాసముంటున్న మదనగోపాల్‌, కోమల దంపతులకు కుమార్తె గౌతమి (15) ఉంది. జీఎస్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మదనగోపాల్‌ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఇంటి బాగోగులను కోమల చూసుకుంటూ వస్తున్నారు. మదన్‌గోపాల్‌ చనిపోయి శుక్రవారంతో మూడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తండ్రిని గుర్తు చేసుకుని మనోవేదనకు లోనైన కుమార్తె గౌతమి గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

పలు రైల్వేస్టేషన్లలో

స్టాపింగ్‌కు అనుమతి

గుంతకల్లు: తిరుపతి–కదిరిదేరపల్లి ప్యాసింజర్‌ రైళ్లకు పలు రైల్వేస్టేషన్లలో స్టాపింగ్‌కు అనుమతులు ఇచ్చినట్లు డివిజన్‌ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు–బళ్లారి సెక్షన్‌లోని బేవనహాలు–వీరపూర్‌ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న టీ.సాకేబండ రైల్వేస్టేషన్‌లో, తిరుపతి–చంద్రగిరి సెక్షన్‌లోని తిరుపతి వెస్ట్‌ రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement