అనంతపురం టౌన్: కరెంటు కావాలంటే ఇకమీదట రీచార్జ్ చేసుకోవాల్సిందే. అవును ఇది నిజం. మొబైల్ – డీటీహెచ్‌కు ఎలా అయితే చేస్తారో కరెంటు కోసం కూడా అలానే రీచార్జ్ చేయాలి. విద్యుత్ వృథా ఖర్చును ఆరికట్టడం కోసమే చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానాన్ని చాలాప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రజాసంఘాల నాయకులు వ్యతిరేకించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తొలుతగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ రీచార్జ్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
రీచార్జ్ మొత్తం ఇలా...
ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ప్రతి నెలా రీచార్జ్ చేస్తేనే విద్యుత్ సరఫరా అవుతుంది. 12 నెలల విద్యుత్ బిల్లును ర్యాండమ్‌గా తీసుకొని నెల వారీ ఖర్చు (యూనిట్లు)ను అంచనా వేసి.. అందుకు అనుగుణంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజులు ముందుగానే వినియోగదారునికి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇలా మొబైల్‌కు మెసేజ్ వచ్చిన వెంటనే వినియోగదారు ఎంతమేర విద్యుత్ వినియోగించారు.. అందు కోసం పెట్టిన ఖర్చు.. మిగిలిన బ్యాలెన్స్ వివరాలు మెసేజీలో తెలియజేస్తారు. తద్వారా వినియోగంపై స్పష్టత వస్తుంది. రీచార్జ్ చేసుకోవడం ఆలస్యమైతే ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్లి రీచార్జ్ చేసుకుంటే నిమిషాల్లోనే విద్యుత్ పునరుద్దరిస్తారు. ఇందు కోసం స్మార్ట్ మీటర్ల కంపెనీ ఒక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, తమ సిబ్బందితో మానిటరింగ్ చేస్తుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో
చకచకా స్మార్ట్ మీటర్లు
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 14 వేల కార్యాలయాల్లో ఇప్పటికే 11 వేల కార్యాలయాల్లో స్మార్టు మీటర్లు ఏర్పాటు చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో 10 వేల కార్యాలయాలకు గాను 7వేల కార్యాలయాల్లో ఇప్పటికే మీటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన కార్యాలయాల్లో సైతం మరో 10 రోజుల్లో 100 శాతం ప్రీ పెయిడ్ స్మార్టు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు అనంతపురం నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లోని వీధి దీపాలకు సైతం స్మార్టు మీటర్లు అనుసంధానం చేయనున్నారు.
ప్రీపెయిడ్ స్మార్టు విద్యుత్ మీటర్
ఇక స్మార్ట్ మీటర్ల ద్వారానే
విద్యుత్ సరఫరా
ఉమ్మడి జిల్లాలో 24 వేల కనెక్షన్లు
ఏప్రిల్ 1 నుంచి
ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు
విద్యుత్ వృథా ఖర్చు, దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు కీలకంగా వ్యవహరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీధి దీపాలు రాత్రి, పగలు తేడా లేకుండా వెలుగుతూనే ఉంటాయి. స్మార్ట్ మీటర్లకు వీధి దీపాలను అనుసంధానం చేస్తే సాయంత్రం 6 గంటల నుంచి వెలుగుతాయి. తిరిగి మరుసటిరోజు ఉదయం ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి. దీంతో విద్యుత్ ఖర్చు సైతం అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది.


