‘ఉపాధి’ నిర్వీర్యమే లక్ష్యంగా కేంద్రం కుట్ర | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ నిర్వీర్యమే లక్ష్యంగా కేంద్రం కుట్ర

Feb 3 2026 7:31 AM | Updated on Feb 3 2026 7:31 AM

‘ఉపాధి’ నిర్వీర్యమే లక్ష్యంగా కేంద్రం కుట్ర

‘ఉపాధి’ నిర్వీర్యమే లక్ష్యంగా కేంద్రం కుట్ర

అనంతపురం అర్బన్‌: గ్రామీణ పేదలకు భరోసాగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. వీబీ జీ రామ్‌ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకట్‌, వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పేద వ్యవసాయ కార్మికులకు అన్యాయం చేస్తూ రోజువారీ కనీస వేతనం రూ.240కి కుదించారన్నారు. లోటుబడ్జెట్‌లో పాలన సాగిస్తున్న రాష్ట్రాలు భారాన్ని మోయలేక ఉపాధి పనులు కల్పించలేవని, దీంతో తిరిగి వలసలు ప్రారంభమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెనుకబడిన అనంతపురం వంటి జిల్లాలకు కొత్త చట్టం శరాఘాతమేనన్నారు. కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించే దాకా ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సదస్సులో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీరమణ, పీపుల్స్‌ మానిటరింగ్‌ మిటీ వ్యవస్థాపకుడు సత్యబోసు, వైఎస్సార్‌ కడప జిల్లా కార్యదర్శి హనుమేష్‌, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేషులు, ప్రవీణ్‌కుమార్‌, కర్నూలు జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్‌, సహాయ కార్యదర్శులు లింగన్న, రామాంజినేయులు, నంద్యాల జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్‌, నాయకులు సునీల్‌, సూరి, భాస్కర్‌, నిర్మల, వీరనాగప్ప, మల్లేష్‌, చంద్రు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement