అరటి రైతు అరణ్య రోదన | - | Sakshi
Sakshi News home page

అరటి రైతు అరణ్య రోదన

Mar 6 2026 8:22 AM | Updated on Mar 6 2026 8:22 AM

అనంతపురం అగ్రికల్చర్‌: అరటి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. గత నవంబర్‌లో టన్ను రూ.2 వేలకు పడిపోవడంతో రెండో పంట కింద వచ్చిన అరటి అమ్ముకోలేక నానా అవస్థలు పడ్డారు. విధి లేని పరిస్థితుల్లో కొందరు దున్నేయగా, మరికొందరు పశువులకు వదిలేసి, తోటలకు నిప్పు పెట్టి తొలగించుకున్నారు. అరటి రైతుల ఆక్రందనలు మిన్నింటినా చంద్రబాబు సర్కారు కనికరించలేదు. ఆదుకునేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. కొన్నిరోజులకు మార్కెట్‌ పరిస్థితి కొంత మెరుగవ్వడంతో ఇబ్బంది లేదనకున్నారు. కానీ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ సారి మొదటి పంట కావడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో భారీ నష్టాలను తలచుకుని వణికిపోతున్నారు.

60 శాతంపైగా కోతలు..

అనంతపురం జిల్లాలో 39 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 3 వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేశారు. మొదటి పంటకు ఎకరాకు రూ. 1.50 లక్షలు, రెండో పంటకు ఎకరాకు రూ. లక్ష వరకు ఖర్చు చేశారు. 9 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఫలసాయం రావొచ్చని అధికారులు అంచనా వేశారు. డిసెంబర్‌ 15 నుంచి మొదటి పంట కింద 5 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఆ తర్వాత సెప్టెంబర్‌ నుంచి రెండు, మూడు పంటల కింద 4 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడులు లెక్క వేశారు. కొన్నిరోజులుగా జిల్లా వ్యాప్తంగా మొదటి పంట కోతలు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 60 శాతానికి పైగా కోతలు పూర్తయినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కోతలకు సిద్ధంగా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ఉంది.

భారీగా ధర పతనం..

మొదటి పంట కోతలు మొదలైన డిసెంబర్‌ 15 తర్వాత అరటి టన్ను రూ.15 వేలతో ప్రారంభమై జనవరి 15 నాటికి రూ.20 వేలకు చేరుకుంది. ఫిబ్రవరిలో రూ.22 వేల నుంచి రూ.25 వేలు పలకడంతో తమ పంట పండిందని రైతులు సంబరపడ్డారు. నష్టాల నుంచి గట్టెక్కినట్లేనని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ధర రూ.15 వేలకు పడిపోవడంతో అరటి రైతులు ఉలిక్కిపడ్డారు. ఇదే క్రమంలో మరింత పతనమై నేడు టన్ను రూ.10 వేలకు చేరుకోవడంతో వణికిపోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధం మొదలు కావడం... అది కాస్త గల్ఫ్‌ దేశాలకు విస్తరించడం.. దీంతో ఉత్తరాది వ్యాపారులు అరటి కొనుగోలుకు వెనుకాడుతుండడం వెరసి మన అరటి రైతుల మీదికొచ్చినట్లయింది. వారం రోజులుగా కొనుగోలు చేసిన అరటి కూడా గోదాములకే పరిమితం కావడంతో వ్యాపారులు కొత్త సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు. ధర ఇంకా పతనం కావొచ్చని ప్రచారం సాగుతుండటంతో అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2 లక్షల మెట్రిక్‌ టన్నుల అరటి అమ్మకాకు సంబంధించి రైతులకు రూ.200 కోట్లకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

15 రోజుల క్రితం రూ.25 వేలు.. నేడు రూ.10 వేలు

రానున్న రోజుల్లో ధర మరింత

పతనమవుతుందని ఆందోళన

నష్టాలను తలచుకుని

వణికిపోతున్న అన్నదాతలు

అదే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న చంద్రబాబు సర్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement