అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పరిశీలకుల నియామకం | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పరిశీలకుల నియామకం

Mar 6 2026 8:22 AM | Updated on Mar 6 2026 8:22 AM

అనంతపురం: జిల్లాలోని అసెంబ్లీ నియోజకర్గాలకు వైఎస్సార్‌సీపీ పరిశీలకులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గుంతకల్లు నియోజకవర్గ పరిశీలకుడిగా లింగాల శివశంకర్‌ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకుడిగా డాక్టర్‌ బత్తల హరి ప్రసాద్‌, తాడిపత్రి నియోజకవర్గ పరిశీలకుడి గా అత్తార్‌ చాంద్‌బాషా, కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిశీలకుడిగా ఎం. మహేంద్రనాథ్‌ రెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకుడిగా కే.రమేష్‌ రెడ్డి, శింగనమల నియోజకవర్గ పరిశీలకుడిగా ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి, అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ పరిశీలకుడిగా బోయ తిప్పేస్వామి నియమితులయ్యారు.

నేడు దిశ సమావేశం

అనంతపురం టవర్‌క్లాక్‌: జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని డీపీఆర్‌సీ భవనంలో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శివశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కలె క్టర్‌ మెంబరు సెక్రటరీగా వ్యవహరిస్తారన్నారు. నాల్గో త్రైమాసికానికి సంబంధించి పురోగతిపై ‘దిశ’ చైర్మన్‌ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సమీక్షిస్తారన్నారు. అధికారులు తప్పకుండా హాజరుకావాలని కోరారు.

క్వింటా చింతపండు

రూ.22 వేలు

హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.22 వేలు పలికింది. గురువారం యార్డుకు 5,650 క్వింటాళ్ల చింతపండు రాగా, అందులో కరిపులి రకం గరిష్టంగా రూ.22 వేలు, కనిష్టంగా రూ.10,100 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయని కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. అలాగే ఫ్లవర్‌ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.12,300, కనిష్టంగా రూ.6 వేల ప్రకారం ధర పలికినట్లు వెల్లడించారు. మార్కెట్‌ యార్డులో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతాయన్నారు. రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని కార్యదర్శి సూచించారు.

ఇకపై రుసుం చెల్లిస్తేనే

జనన, మరణ ధ్రువపత్రాలు

అనంతపురం: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో జనన, మరణ ధ్రువపత్రాలు పొందాలంటే ఇక నుంచి రుసుము చెల్లించాల్సి ఉంటుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లీశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనన, మరణ ధ్రువపత్రం పొందాలంటే రూ.50 చెల్లించాలి. జనన ధ్రువీకరణ పత్రంలో బిడ్డ పేరు నమోదుకు (పుట్టిన సంవత్సరం తరువాత) రూ.250 చెల్లించాలి. జనన, మరణ అదనపు పత్రాలు పొందడానికి ఒక కాపీకి రూ.50, జనన, మరణ రిజిస్టర్‌లో మొదటి సంవత్సరం శోధనకు రూ.50, ప్రతి అదనపు సంవత్సరం శోధనకు రూ.25, జనన, మరణ వివరాల నమోదుకు 21 రోజుల నుంచి 31 రోజుల ఆలస్యమైతే రూ.25 ఆలస్య రుసుం, 31 రోజుల నుంచి సంవత్సరంలోపు రూ.250, ఏడాది దాటితే రూ.500 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జనన, మరణ ధ్రువపత్రాలు అందించేందుకు కూడా రుసుం వసూలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉచితంగా అందించిన ప్రతి సేవకు నేడు డబ్బు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని బాహాటంగానే ప్రజలు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement