కదిరి: శేషవాహనంపై దేవేరులతో కలిసి మాఢవీధుల్లో ఊరేగిన ఖాద్రీశుడి దర్శనంతో భక్తజనం పరవశం చెందారు. లక్ష్మీ నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు శేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్గించారు. ప్రతి ఉత్సవంలోనూ నారసింహుడు మాత్రమే తిరు వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చేవారు. అయితే శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత ఖాద్రీశుడు తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు.
అర్ధరాత్రి వరకూ నిత్యాన్నదానం
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరగటంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది. వీరి కోసం ఆలయంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ నిత్యాన్నదానం కొనసాగుతోంది. స్వామివారి గోవింద నామస్మరణతో ఖాద్రీ క్షేత్రం మార్మోగిపోతోంది. కదిరి కొండపై జ్యోతిని వెలిగించడంతో కదిరి ప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు.
దివి నుంచి భువికి
వైకుంఠంలో స్వామి నిత్యం పవళించే శేషతల్పం ఆ స్వామితో పాటే భువికి దిగి వచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల్లో స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిస్తున్నారని వారి నమ్మకం. ‘శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి’ అని అర్చక పండితులు పేర్కొన్నారు. సాయం సంధ్య వేళలో యాగశాల ప్రవేశం, నిత్య హోమాలు నిర్వహించి స్వామివారిని సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆచార్య రుత్వికులను ఆలయ మర్యాదలతో అర్చకులు ఆహ్వానించారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే సర్పదోషం తొలగుతుందని భక్తుల విశ్వాసం. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.


