రేపు ‘ప్రత్యేక వేదిక’
అనంతపురం టౌన్: పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా మొదటి, మూడో బుధవారం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. మూడో బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు తిరుపతిలోని సీఎండీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. మొదటి బుధవారం జిల్లా కేంద్రాల్లోని ఎస్‌ఈ కార్యాలయాల్లో కార్యక్రమం ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీజేపీ ప్రభుత్వం ఉపాధి పథకాన్ని భ్రష్టు పట్టించింది
● ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల
శింగనమల(నార్పల): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. నార్పల మండలం బండ్లపల్లిలో సోమవారం ఆమె ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం 2006 ఫిబ్రవరి 2న ఇదే గ్రామంలో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా కరువు ప్రాంతం కావడంతో ఈ పథకాన్ని ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. ఈ పథకం ఉపాధి కూలీల జీవితాల్లో వెలుగులు తెచ్చిందన్నారు. అలాంటి పథకానికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పేరు మార్చడంతో పాటు నిర్వీర్యం చేస్తోందన్నారు. 40 శాతం నిధులు రాష్ట్రాలే భరించాలని పేర్కొనడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి,రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు దాదాగాంధీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలి, శింగనమల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సాకే శంకర్ తదితరులు పాల్గొన్నారు.


