‘అప్పుల అమరావతి’గా మార్చారు
అనంతపురం అర్బన్: రాష్ట్ర రాజధానిని అప్పుల అమరావతిగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పటికే భారీగా అప్పులు చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని అప్పులు తెచ్చే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామితో కలిసి విలేకరులతో జగదీష్ మాట్లాడారు. అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు, ఇక్కడి ప్రజలు ఎలా అభివృద్ధి సాధిస్తారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు భూములు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. హంద్రీ–నీవా, హెచ్‌ఎల్‌సీ ఆధునీకరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరందేలా పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలన్నారు. హంద్రీ– నీవా ద్వారా 40 టీఎంసీలు, హె చ్‌ఎల్‌సీ ద్వారా 32 టీఎంసీలు వస్తే రాయలసీమ జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం తగదన్నారు. ఈనెల 16 నుంచి 18వ తేదీల్లో కాకినాడలో జరిగే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో అన్ని అంశాలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు శ్రీరాములు, తలారి నారాయణస్వామి, వి.కృష్ణుడు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ మండిపాటు


