కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం | - | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

మాజీ మంత్రి శైలజానాథ్‌

అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేతల్ని కేసుల్లో ఎలా ఇరికిద్దామని కుట్రలు చేయడమే తప్ప రాష్ట్రానికి ఏం చేద్దామనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేకుండాపోయిందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనీస నిధులను కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారన్నారు. సోమవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఉందని అభివర్ణించారు. రైతులు వాడే ఆముదం చెక్క, అమ్మోనియో ఫాస్పేట్‌, నైట్రోజన్‌ ఫాస్పేట్‌ ధరలు భారీగా పెంచారన్నారు. వ్యవసాయ బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకే రూ.16 వేల కోట్లు కోత విధించారన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధర ప్రస్తావనే లేదన్నారు. ఫసల్‌ బీమాకు డబ్బులు పెరగాల్సింది పోయి రూ.14,473 నుంచి రూ.12,200కు తగ్గించేశారన్నారు. కోకో, జీడిపప్పు వంటి హైవ్యాల్యూ ఉత్పత్తుల పరిశోధనలకు మాత్రమే నిధులిచ్చారన్నారు. ఎగుమతులకు రూ.350 కోట్లు, నమో డ్రోన్లకు రూ.676 కోట్లు ఇచ్చి, సాధారణ రైతుల్ని మాత్రం బడ్జెట్‌లో విస్మరించారన్నారు. ఉపాధి హామీ పథకంలో రూ.58 వేల కోట్లు కోత విధించి పేదలకు తీరని విఘాతం కలిగించారన్నారు. చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న అమరావతి రైలుకు సైతం ఈ బడ్జెట్‌లో మొండిచేయే చూపారన్నారు. విశాఖ రైల్వే జోన్‌ గురించి అసలు ప్రస్తావనే లేదన్నారు.

ప్రశ్నించలేని స్ధితిలో చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగినా ప్రశ్నించలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. మీ ఎంపీల్ని తీసుకెళ్లి బడ్జెట్‌లో న్యాయం చేయాలని, ఏపీ విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని అడగాలని సూచించారు. ల్యాండ్‌ పూలింగ్‌ పథకం పెట్టి రైతుల భూములు లాక్కున్నారన్నారు. గుంటూరు, విజయవాడ, అమరావతితో బృహత్‌ నగరం చేస్తామంటున్న చంద్రబాబు.. రాజధానిలో నీళ్లు తోడే కార్యక్రమం ముందు ఆపాలన్నారు. ఎక్కడైనా నదుల నుంచి పొలాల్లోకి నీళ్లు తోడతారు, కానీ అమరావతిలో మాత్రం ఊర్లో నుంచి ఏట్లోకి నీళ్లు తోడే కార్యక్రమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో గుంటూరు, విజయవాడను కలుపుతామంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారన్నారు. ఢిల్లీకి నెలకోసారి వెళ్లే చంద్రబాబు ఏం సాధించారో ఈ బడ్జెట్‌ తేల్చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నీలం భాస్కర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు కాటమయ్య, బోనాల హరికృష్ణ, దీపు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement