జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణ
భూముల మార్కెట్
విలువ పెంపు!
● అర్బన్ ప్రాంతాల్లో పెంచేందుకు కసరత్తు
● ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న వైనం
● చంద్రబాబు ప్రభుత్వం ధరలు పెంచడం ఇది రెండోసారి
● రియల్ ఎస్టేట్ రంగంపై చూపనున్న తీవ్ర ప్రభావం
అనంతపురం టౌన్: భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పెరిగిన మార్కెట్ ధరలతో అల్లాడిపోతున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం మరోమారు భారం మోపేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భూముల విలువలపై నివేదికలను ఇవ్వాలని ఆయా జిల్లా రిజిస్ట్రార్లకు స్టాంప్స్ అండ్ రిజిస్ష్రేషన్ శాఖ ఐజీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉత్తర్వులను జారీ చేశారు.
పెంపుపై స్పష్టత కరువు
భూముల విలువలను ఎంత మేర పెంచాలన్నదానిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేదు. కేవలం అర్బన్ ఏరియాల్లో పెంచాలనే విషయాన్ని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2025 ఫిబ్రవరిలో జిల్లా వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు, అగ్రికల్చర్ భూములపై 20 నుంచి 30 శాతం మేర మార్కెట్ విలువలను పెంచారు. మళ్లీ ఏడాది గడిచే సమయానికే భూముల విలువను పెంచేందుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఎంత మేర పెంచుతారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పెరిగిన భూముల విలువతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. మళ్లీ పెంచితే ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడనుందని రియల్టర్లు పెదవి విరుస్తున్నారు. ఈసారి కూడా 30 శాతం మేర పెంచే అవకాశం లేకపోలేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు పేర్కొంటుండటం గమనార్హం. భూముల మార్కెట్ విలువల పెంపు విషయంపై జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.


