జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పాఠ్యాంశాలు
అనంతపురం: భారతీయ జ్ఞాన పరంపరను ప్రతిబింబించే రీతిలో రూపకల్పన చేసిన నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలని యూజీసీ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ జితేంద్ర కుమార్ త్రిపాఠి పేర్కొన్నారు. ‘పాఠ్యక్రమంలో భారతీయ జ్ఞాన పరంపర– సమన్వయం’ అంశంపై సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో ఆరు రోజుల పాటు నిర్వహించిన సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూజీసీ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ జితేంద్ర కుమార్ త్రిపాఠి కీలకోపాన్యసం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వీసీ డాక్టర్ ఎస్‌ఏ కోరి మాట్లాడుతూ.. నూతనత్వాన్ని ప్రోత్సహించడంలో సెంట్రల్ యూనివర్సిటీ ముందంజలో నిలిచిందన్నారు. పాఠ్యక్రమ మార్పు జరగాలంటే నిరంతర అధ్యాపక శిక్షణా కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ సి. షీలా రెడ్డి, సదస్సు సమన్వయకర్త డాక్టర్ జి. మాలతి , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్‌బీ ఖివాడే తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ చట్టాన్ని
కొనసాగించాలి: సీపీఐ
అనంతపురం అర్బన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి పేరు మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో దళవారీ ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి తెలిపారు. ఆదివారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో కుళ్లాయిస్వామి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నారాయణస్వామి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇప్పుడు ఏకంగా చట్టాన్ని వీబీజీరామ్‌జీ పథకంగా మార్చివేసిందన్నారు. దీని వల్ల ఉపాధి కూలీలకు ఒరిగేదేమి లేదన్నారు. సగటు వేతనం రూ.260 నుంచి రూ.240కు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ పాత చట్టాన్ని కొనసాగించాలనే డిమాండ్‌తో చేపట్టనున్న దశల వారీ ఉద్యమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జె.రాజారెడ్డి, నాయకులు సంజీవన్ప, గోపాల్, పద్మావతి, గోవిందు, లింగమయ్య, రమణయ్య, రాజేష్‌గౌడ్, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర జయభేరి..
అనంతపురం కార్పొరేషన్: విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడినా.. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో పాటు అదే ఇన్నింగ్స్‌లో ఆంధ్ర బ్యాటర్ రషీద్ అద్భుత సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆంధ్ర జట్టు ఆరు పాయింట్లు దక్కించుకుని రంజీ ఎలైట్‌లో 28 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది. ఆంధ్ర, విదర్భ రంజీ మ్యాన్‌ను భారత జట్టు సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా తిలకించారు.
సెంచరీతో కదంతొక్కిన రషీద్..
259 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆంధ్ర జట్టు 93/1తో ఓవర్ నైట్ స్కోర్‌తో తన ఆటను కొనసాగించింది. జట్టు స్కోర్ 114 పరుగుల వద్ద వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 43 (5ఫోర్లు) పరుగులకు అవుటయ్యాడు. ఈ దశలో ఎస్‌కే రషీద్‌కు, కెప్టెన్ రికీభుయ్ తోడయ్యాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా చూడచక్కని షాట్లతో అలరించారు. ఏ దశలోనూ తడబడకుండా చెలరేగిపోయారు. ప్రధానంగా రషీద్ ఫోర్లతో చెలరేగాడు. అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 144 బంతుల్లో 132 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రికీభుయ్ 92 బంతుల్లో 7 బౌండరీలు, రెండు భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్ భాగస్వామ్యానికి 145 పరుగులు చేశారు.
ముగింపు కార్యక్రమం..
ముగింపు కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, ఏసీఏ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఆర్‌వీసీహెచ్ ప్రసాద్, జీఎం టి.శివకుమార్, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్‌రెడ్డి ముక్యఅతిథులుగా హాజరయ్యారు. టోర్నీలో సెంచరీ చేసిన విదర్భ ఆటగాడు రాథోడ్, ఆంధ్ర ఆటగాడు రషీద్, ఐదు వికెట్లు తీసిన కేఎస్ రాజును అభినందిస్తూ బ్లేజర్లను ఎస్పీ సతీష్‌కుమార్, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ అందించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ అశ్విన్ పాల్గొన్నారు.
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా పాఠ్యాంశాలు


