సునామ జకినీ మాత ఉత్సవాలకు వేళాయె
గుత్తి: స్థానిక ఆర్‌ఎస్ మార్గంలో వెలసిన ఆరె కటికల ఆరాధ్య దైవం సునామ జకినీ మాత ఉత్సవాలు ఈ నెల 29, 30 తేదీల్లో జరుగనున్నాయి. ఏటా మాఘమాసంలో క్రమం తప్పకుండా ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడి అమ్మవారు విరాజిల్లుతున్నారు. భారత దేశంలోనే ఏకై క సునామ జకినీ మాత ఆలయం గుత్తిలో మాత్రమే ఉండడం విశేషం. దీంతో ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా ఆరె కటికలు తరలి రానుండడంతో అదే స్థాయిలో ఏర్పాట్లను ఆలయ కమిటీ నిర్వాహకులు పూర్తి చేశారు. 29న సునామ జకినీ మాత, మల్కూమా జకినీ మాత మూలవిరాట్‌లకు ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు ఉంటాయి. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగించనున్నారు. సాయి బాబా గుడి వద్ద నుంచి పట్టణ పుర వీధుల గుండా అమ్మవారి ఆలయం వరకూ జరిగే ఈ శోభాయాత్రలో కన్యలు, ముత్తయిదువులు పూర్ణ కుంభాలతో పాల్గొంటారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. 30వ తేదీన సామూహిక కుంకుమార్చన, అయ్యప్ప ఆలయంలో సునామ జకినీ మాతకు గంగా స్నానం, పూర్ణ పాల కుంభాలతో ఊరేగింపు, అఽతిథుల ప్రసంగాలు, పది, ఇంటర్, డిగ్రీ తరగతుల్లో అత్యధిక మార్కులు సాదించిన ఆరె కటిక సామాజిక విద్యార్థులకు బహుమతుల ప్రదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాలను జయప్రదం చేయాలని సునామ జకినీ మాత ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆలూరు లక్ష్మణ రావు, ఉపాధ్యక్షుడు ఎంకే బాబురావు, ఆలయ ధర్మకర్త సురేష్ రావు పిలుపునిచ్చారు.
దేశం నలుమూలల నుంచి
తరలి రానున్న ఆరె కటికలు


