ఎందరో వీరుల త్యాగఫలం
అనంతపురం కల్చరల్: గణతంత్ర దినోత్సవ రాకతో జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ప్రబోధితంగా మారింది. దేశమాతకు నీరాజనాలర్పించే సాంస్కృతిక సంబరాలు సిద్ధమయ్యాయి. ఎటు చూసినా మువ్వన్నెల జెండాల రెపరెపలు కనిపిస్తున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వ దాస్యశృంఖలాల నుంచి భరతమాతను స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసిన ఎంతో మంది మేధావులలో ‘అనంత’వాసులూ ఉన్నారు. ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఊర్లకు, వీధులకు త్యాగధనుల పేర్లు పెట్టారు. కేవలం స్వాత్రంత్య్రోద్యమంలోనే కాకుండా రాజ్యాంగ నిర్మాణంలోనూ జిల్లా వాసులు పాలు పంచుకున్నారు.
అనంత త్యాగధనుడు..
జిల్లాలో తొలి స్వాతంత్ర ఖైదీగా పేరొందిన కల్లూరు సుబ్బారావు జీవితం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా సాగింది. అరుదైన వ్యక్తిత్వంతో జిల్లాలో జాతీయోద్యమాన్ని ప్రభావితం చేశారు. బళ్లారిలో మహాత్మునితో కలిసిన తర్వాత ఆయన జీవితం మరింత విలక్షణంగా మారింది. దత్తమండలాలకు రాయలసీమ అని నామకరణం చేసిన వారిలో ఆయన ముందున్నారు. తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, నీలం సంజీవరెడ్డి తదితరులు.. కల్లూరు సుబ్బారావు శిష్యులు కావడం విశేషం. రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకుని ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇక జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన, టవర్‌క్లాక్ నిర్మాణంలో ఆయన చేసిన కృషి మరువలేనిది.
నిక్కమైన నీలం..
శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, లోకసభ స్పీకర్‌గా అన్నింటిని మించి దేశ ప్రథమ పౌరుడిగా ‘అనంత’ ఖ్యాతిని హస్తినలో రెపరెపలాడించిన నీలం సంజీవరెడ్డి 1931లో జాతీయోద్యమంలో కాలు పెట్టిన అనతి కాలంలోనే 1947 నాటికి భారత రాజ్యాంగ రూపకల్పన బృందంలో సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆయనతో పాటూ తొలి ఎంపీగా పనిచేసిన కేఎం రహంతుల్లా సైతం రాజ్యాంగ నిర్మాణంలో సహకారమందించారు. వీరందరి స్ఫూర్తిని జెండా పండుగలొచ్చినప్పుడల్లా జిల్లా వాసులు నెమరేసుకుంటూనే ఉంటారు.
దేశభక్తికి ప్రతిరూపం టవర్‌క్లాక్..
దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించడానికి అవిశ్రాంత పోరాటం చేసి అమరులైన అనంత వాసుల జ్ఞాపకార్థం నగరం నడిబొడ్డున టవర్‌క్లాక్‌ను నిర్మించారు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దీనిని ప్రారంభించిన అనంతరం పీటీసీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. స్వాతంత్రమొచ్చిన సంవత్సరానికి గుర్తుగా టవర్ క్లాక్ 47 అడుగుల పొడవుతో, ఆగస్టు నెలను ప్రతిబింబిస్తూ 8 భుజాలతో, తేదీకి చిహ్నంగా 15 అడుగుల వెడల్పుతో అపురూపంగా నిలించింది.
రాజ్యాంగ నిర్మాణంలో ‘అనంత’ వాసులూ భాగస్వాములే
ఎందరో వీరుల త్యాగఫలం


