బాబోయ్.. ఈ స్టేషన్ మాకొద్దు!
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో వసూళ్లకు కేంద్రంగా మారిన వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో పోస్టింగ్ అంటే ఓ హాట్ కేక్‌లాంటిది. సిఫార్సు లేఖలతో ఇక్కడకు పలువురు అదే పనిగా పోస్టింగ్ తెచ్చుకుని వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ‘ఈ స్టేషన్ ... మాకొద్దు’ అంటూ పలువురు బదిలీకి దరఖాస్తులు చేసుకుంటున్నారు. బదిలీ కాకపోయినా కనీసం డిప్యుటేషన్‌ౖపైనెనా తమను ఇక్కడి నుంచి పంపేయండి అంటూ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఈ జాబితాలో నలుగురు కానిస్టేబుళ్లు ఉండగా... త్వరలో మరికొందరు అదే బాటలో పయనించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓ ఏఎస్‌ఐ, మరో కానిస్టేబుల్ అందరిపై పెత్తనం చెలాయిస్తుండడం.. ‘స్టేషన్ బాస్’ తరుచూ బూతులతో విరుచుకుపడుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
వారానికి రూ.లక్షల్లోనే వసూళ్లు..
అనంతపురంలోని వన్‌టౌన్ పీఎస్‌లో ప్రొటోకాల్ విధులు నిర్వహిస్తున్న ఓ ఏఎస్‌ఐ, కానిస్టేబులుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్కా నిర్వాహకులు, వైన్‌షాపులు, బార్‌లు, లాడ్జీలు ఇలా అవకాశమున్న ప్రతి చోటా వారం మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. కేవలం ఈ ఇద్దరి కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తోందని ఆ శాఖలోని పలువురు బాహటంగానే పేర్కొంటున్నారు. క్రైంపార్టీ సిబ్బంది ఎక్కడైనా దాడులు చేసినా.. నేరస్తులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించినా మరుక్షణమే సదరు ఏఎస్‌ఐ, కానిస్టేబులు అక్కడ ప్రత్యక్షమై పైరవీలకు తెరలేపుతుంటారు. పట్టుబడిన వ్యక్తి కావాల్సిన వాడని, వదిలేయాలంటూ హుకుం జారీ చేస్తారు. కాదూకూడదని అంటే క్రైం పార్టీ సిబ్బంది వైఖరిని వెంటనే ‘బాస్’ దృష్టికి తీసుకెళుతుంటారు. ఈ విషయాన్ని ఆ బాస్ కాస్త తీవ్రంగా పరిగణిస్తూ బూతులతో రెచ్చిపోతుండడం పరిపాటిగా మారింది. ఇటీవల నూతన సంవత్సరం రోజున అసభ్యపదజాలంతో దూషించాడంటూ పలువురు కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ పొందే ఓ సీనియర్ ఉద్యోగిపై సైతం అందరూ చూస్తుండగానే బూతులతో రెచ్చిపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. తన సర్వీసులో ఈ స్థాయిలో ఎన్నడూ అవమానపడలేదంటూ సదరు ఉద్యోగి తన సహచరులతో చెప్పుకుని కన్నీరు పెట్టినట్లుగా తెలిసింది.
గాడిలో పెట్టేరా?
నగరంలోని పోలీసు స్టేషన్లపై డీఎస్పీ శ్రీనివాసరావు పెద్దగా దృష్టిసారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నేరాల కట్టడి, సిబ్బంది పనితీరుపై ఎలాంటి సమీక్షలు జరగకపోవడమే ఇందుకు నిదర్శనం. అనంతపురం డివిజన్‌తో పాటు ఇన్‌చార్జ్ రూరల్ డీఎస్పీగా విధులు ఆయనే నిర్వర్తిస్తున్నారు. గతంలో ఎస్సీ,ఎస్టీ సెల్, ట్రాఫిక్ , సీసీఎస్‌లకు ప్రత్యేక డీఎస్పీలు ఉండేవారు. ఇప్పుడవన్నీ ఒకేఒక్కరికి అప్పగించారు. దీంతో ఆయనెప్పుడూ బిజీ గానే ఉండిపోతున్నారు. ఫలితంగా పోలీసు స్టేషన్లలో పాలన గాడి తప్పుతోంది. ఇప్పటికై నా గాడితప్పిన అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌ను జిల్లా పోలీసు బాస్ గాడిలో పెడతారో? లేదో వేచి చూడాలి!
అనంతపురంలోని వన్‌టౌన్ పీఎస్
అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌లో
పనిచేయడానికి హడలిపోతున్న సిబ్బంది
ఇతర పోలీసుస్టేషన్లకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు దరఖాస్తు
అధికారుల మితిమీరిన పెత్తనమే కారణం


