చట్టాలనే నిర్వీర్యం చేస్తారా?
అనంతపురం: అధికార పార్టీ ప్రాపకం కోసం క్రిమినల్ చట్టాలనే పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని, ఇందుకు యల్లనూరు ఘటననే నిదర్శమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 1న యల్లనూరులో వైఎస్సార్‌సీపీకి చెందిన 12 మందిపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారన్నారు. ఘటనలో గాయపడింది వైఎస్సార్‌సీపీ నేతలేనని పేర్కొన్నారు. అయినా వీరందరూ ప్రస్తుతం జైలులో ఉన్నారని, దాడికి పాల్పడిన టీడీపీ నేత డి.రామాంజినేయులు అలియాస్ డాన్, దొడ్లో పవన్, దొడ్లో చిన్న ఓబులేసు, దొడ్లో ఓబులేసు, దొడ్లో కిరణ్, బాబు తదితరులపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వీరందరిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయకుండా పోలీసులు మిన్నకుండి పోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హత్యాప్రయత్నాన్ని శిక్షార్హమైన నేరంగా సెక్షన్ 307 ఐపీసీ పరిగణిస్తుందన్నారు. నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. ఒకవేళ బాధితులెవరికైనా హాని కలిగితే జీవిత ఖైదు పడే అవకాశమూ ఉందన్నారు. ఇంతటి తీవ్రమైన సెక్షన్‌లో కేవలం ముగ్గురిని అరెస్ట్ చేసి, మిగిలిన వారిని గాలికి వదిలేసి పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు దొడ్లో రామాంజనేయులు స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని, ఎమ్మెల్యే కార్యాలయం వద్దనే ఉంటున్నాడనే విషయం పోలీసులకు కూడా తెలుసునన్నారు. అయినా అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో గ్రామంలో రైతులు వరి పైరుకు నీరు పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. ఈ లెక్కన పోలీసుల తీరు చూస్తుంటే గ్రామ కక్షలకు ఆజ్యం పోసే రీతిలో ఉందని మండిపడ్డారు. యల్లనూరు ఘటనలో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఎస్పీని కలసి విన్నవిస్తామని పేర్కొన్నారు.
పోలీసుల తీరును ప్రశ్నించిన
మాజీ మంత్రి సాకే శైలజానాథ్


