మహిళ బలవన్మరణం
ధర్మవరం అర్బన్: కడుపునొప్పి తాళలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మవరం పట్టణంలో సోమవారం జరిగింది. టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన చాంద్‌బా షా, పఠాన్ రోష్ని (30) దంపతులు. చాంద్‌బాషా సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోష్ని కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఆసుపత్రుల్లో చికిత్సలు పొందినా కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురైన రోష్ని సోమవారం ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతురాలి తల్లి పర్హానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.
నీటి సంపులోకి జారిపడి బాలుడి మృత్యువాత
కళ్యాణదుర్గం రూరల్: నీటి సంపులోకి జారిపడి బాలుడు మృత్యువాత పడిన ఘటన ‘దుర్గం’లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన మేరకు... హైదరాబాద్‌కు చెందిన రవి, మీన దంపతులు. చాలా ఏళ్ల క్రితమే వ్యాపార నిమిత్తం కళ్యాణదుర్గానికి వలస వచ్చారు. స్థానిక విద్యానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. రెండో కుమారుడు సామ్యూల్ (16) సోమవారం తన స్నేహితులతో కలిసి కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో ఐదుకల్లు రోడ్డు వద్ద ఉన్న వ్యవసాయ తోటలో నీటిసంపు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి సంపులో పడిపోయాడు. ఆలస్యంగా గమనించిన స్నేహితులు సామ్యూల్‌ను బయటకు లాగి స్థానిక సీహెచ్‌సీకి తరలించగా... పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధరించారు. పట్టణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


