కళ్యాణదుర్గంలో భారీ చోరీ
కళ్యాణదుర్గం: పట్టణంలోని మారెంపల్లిలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఇంటి యాజమానికి ఆరోగ్యం బాగోలేదని అనంతపురం ఆసుపత్రికి వెళ్తే రాత్రికి రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారు, వెండిని కొల్లగొట్టడం కలకలం రేపింది. బాధితులు తెలిపిన మేరకు... మారెమ్మ కాలనీలో షఫీ, ఖాసీం బీ దంపతులు చికెన్ కబాబ్ సెంటర్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఓ శుభకార్యం జరగడంతో ఖాసీంబీ బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో పాటు కుమార్తె, కోడలు, అల్లుడికి చెందిన ఆభరణాలు సైతం తన వద్దే ఉంచుకుంది. ఆదివారం షఫీ అనారోగ్యానికి గురికావడంతో దంపతులిద్దరూ అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఆలస్యం కావడంతో రాత్రికి అక్కడే బంధువుల ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న వారికి గేటు తాళాలు పగులగొట్టిన స్థితిలో కనిపించాయి. లోపల బీరువాను సైతం పగులగొట్టినట్లు గుర్తించారు. బీరువాలో ఉంచిన 11 తులాల బంగారు నగలు, కిలో వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో బోరున విలపించారు. వెంటనే విషయాన్ని కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ హరినాథ్ క్లూస్ టీం సభ్యులను ఘటనాస్థలికి పంపారు. ఇంట్లో పలు చోట్ల క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. చోరీకి గురైన వాటి విలువ రూ.19 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు వాపోయారు. ఈ మేరకు కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
11 తులాల బంగారం,
కిలో వెండి ఆభరణాల అపహరణ


