అగ్ని ప్రమాదంలో గాయపడిన బాలిక మృతి
గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలిక నాగసముద్రం లక్ష్మి (10) సోమ వారం రాత్రి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు, శ్రీనివాసులు వరుసకు అన్నదమ్ములు. ఈ నెల 16న ఇద్దరు చిన్నపాటి విషయంపై గొడవ పడ్డారు. రామాంజనేయులు తన అన్న శ్రీనివాసులుపై తొండ విసరగా అది అతడి మెడను కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసులు అదే రోజు రాత్రి రామాంజనేయులు ఇంటిపై పెట్రోల్ బాటిల్ విసిరి నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో రామాంజనేయులు భార్య అశ్విని, కుమారుడు శివగంగ త్రుటిలో తప్పించుకోగా మంటల్లో చిక్కుకొని నాగసముద్రం లక్ష్మి తీవ్రంగా గాయపడింది. బాలికను మొదట గుత్తి ఆసుపత్రికి, అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది. ఘటనకు కారణమైన శ్రీనివాసులును గుత్తి పోలీసులు ఈ నెల 19న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


