గణతంత్ర వైభవం
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న ఇన్‌చార్జ్
కలెక్టర్ విష్ణుచరణ్, ఎస్పీ జగదీశ్
అనంతపురం అర్బన్/ అనంతపురం కల్చరల్: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని సోమవారం 77వ గణతంత్ర వేడుకలు జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. ఊరూ, వాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అంతటా గణతంత్ర వైభవం కొనసాగింది. దేశభక్తి వెల్లివిరిసింది. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లాస్థాయి వేడుకలు నిర్వహించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, నగర పాలక సంస్థ మేయర్ వసీం, అహుడా చైర్మన్ టి.సి.వరుణ్, మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ బల్లా పల్లవి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఎస్పీ పి.జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, డీఆర్‌ఓ మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గీతం.. దేశభక్తి ప్రబోధితం
గణతంత్ర దినోత్సవం రాకతో దేశభక్తి ఉట్టిపడింది. కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ‘నింగి వంగి నేల పొంగి’ అంటూ దేశమాతను కీర్తించి నర్తించిన శెట్టూరు మండలం యాటకల్లు జెడ్పీ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి దక్కింది. హెల్మెట్లు వాడకపోవడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఏజీ అనిల్‌కుమార్‌రెడ్డి బృందం రూపొందించిన ‘ఓ అన్నా జాగ్రత్త’ అంటూ సాగిన గీతాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఆటపాటలను ప్రదర్శించిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతిని, ‘దేశం కోసం జీవిద్దాం’ అనే పాటతో కురుగుంట కేజీబీవీ విద్యార్థినులు తృతీయ బహుమతిని, ‘ఇదే మన భారతం’ అన్న పాటతో వచ్చిన రక్షక్ ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు ప్రోత్సాహక బహుమతిని అందుకున్నారు.
ఆకట్టుకున్న శకటాలు, స్టాల్స్
రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రభుత్వ శాఖలు ప్రగతి శకటాల ప్రదర్శన నిర్వహించాయి. వివిధ శాఖలు ప్రదర్శించిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ప్రధానంగా పోలీసు జాగిలాల విన్యాసాలు ఆహూతులను ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరలో దేశసేవలో తరించిన ఐదుకల్లు సదాశివన్, పీజీ కొండయ్య, మేడా వెంకటాచలం వంటి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను కలెక్టర్, ఇతర అధికారులు ఘనంగా సత్కరించారు. అనంతరం విశిష్ట సేవలందించిన 451 మందికి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు మల్లికార్జునుడు, రామ్మోహన్, తిప్పనాయక్, జిల్లా సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజు నాయుడు, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, విభాగాల సూపరింటెండెంటు వసంతలత, యుగేశ్వరిదేవి, రియాజుద్దీన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
గణతంత్ర వైభవం
గణతంత్ర వైభవం


