గ్యాస్ ‘గమనించండి’
హౌసింగ్‌బోర్డులో నివాసముంటున్న మల్లికార్జున ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో దానికి సీల్ లేదు. ఎందుకు తొలగించారని డెలివరీ బాయ్‌ని ప్రశ్నిస్తే గ్యాస్ లీకేజీ చెక్ చేసేందుకని బుకాయించి వెళ్లిపోయాడు. అయితే ఆ సిలిండర్‌లోని గ్యాస్ నెల రోజులు కూడా రాకపోవడంతో తమను డెలివరీ బాయ్ మోసం చేసినట్లుగా నిర్ధారించుకున్నాడు.
అనంతపురం అర్బన్: వంట గ్యాస్ సిలండర్లకు కంపెనీ వేసిన సీలు ఉందా లేదా? గ్యాస్ నిర్ణీత బరువు ఉందా... లేదా? అనేది వినియోగదారులు గమనించాలి. ఇటీవల కొందరు డెలివరీ బాయ్స్ సిలిండర్ల సీల్ తొలగించి వాటిలోని వంట గ్యాస్‌లో కొద్ది మేర దొంగలించి సరఫరా చేస్తున్నారు.
సీల్ ఉందా లేదో చూసుకోండి
గ్యాస్ సిలిండర్ నాబ్‌కి సదరు కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్‌ని ఒకసారి గమనించి అది బిగుతా లేకుండా ఊడిపోయినట్లుగా ఉంటే వెంటనే తిరస్కరించాలి. దానికున్న సీల్ తొలగించడం నేరం. అలాంటి సిలిండర్లను సరఫరా చేస్తే సంబంధిత ఏజెన్సీతో పాటు డెలివరీ బాయ్‌పై కఠిన చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంది. కాబట్టి ఎవరైనా సీల్ తొలగించి సిలిండర్ సరఫరా చేసినట్లయితే తక్షణమే అధికారులు ఫిర్యాదు చేయాలి.
గ్యాస్ లీకేజీపై అప్రమత్తత అవసరం
రెగ్యులేటర్ అమర్చే నాబ్ వద్ద రబ్బర్ వాచర్ సరిగ్గా లేకపోతే గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి సిలిండర్ నుంచి గ్యాస్ లీకవుతోందా, లేదా అనేది చెక్ చేయించుకోవాలి. బాయ్ మీ ఎదుటనే సిలిండర్ నాబ్‌కు వేసిన సీల్‌ను తొలగించి రెగ్యులేటర్ అమర్చి గ్యాస్ లీకేజీ ఉందో, లేదో చెప్పేస్తాడు. ఒకవేళ గ్యాస్ లీకవుతోంటే వాచర్ మారుస్తాడు. అలాగే మీరు కూడా బాయ్‌ను అడిగి ఒకటో రెండో వాచర్లు తీసుకోండి. ఎప్పుడైనా గ్యాస్ లీకవుతుంటే మీరే స్వయంగా వాచర్ మార్చుకోవచ్చు.
స్ప్రింగ్ త్రాసు తప్పని సరి
వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్ వెంట తప్పని సరిగా స్ప్రింగ్ త్రాసు ఉండాలనే నిబంధన ఉంది. గృహ అవసర సిలిండర్‌లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు కలిపి మొత్తం 29.500 కేజీలు ఉండాలి. డెలివరీ బాయ్స్ తమ వెంట తెచ్చుకున్న స్రింగ్ త్రాసుతో తూకం వేసిన తర్వాతనే వినియోగదారుడికి సిలిండర్ అందజేయాలి. బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణం తూకం వేయించండి. స్ప్రింగ్ త్రాసు లేదని చెబితే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
గ్యాస్ ‘గమనించండి’


