పశువుల షెడ్డు.. ‘పచ్చ’ నేతలకు ఫుడ్డు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పాడి రైతుకు వెన్నదన్నుగా నిలిచేందుకు ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న పశువుల షెడ్లు తెలుగు తమ్ముళ్లకు కాసుల పంటను కురిపిస్తున్నాయి. ఉపాధి హామీ అధికారులు వత్తాసు పలకడంతో అడ్డగోలు అవినీతికి తెరలేపారు. షెడ్లు నిర్మించకుండానే ఏకంగా పూర్తి బిల్లులు స్వాహా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.
ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.1.72 లక్షలు
బ్రహ్మసముద్రం మండలంలోని గొంచిరెడ్డిపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబ్–జీ రామ్‌జీ) కింద పాడి రైతులకు 10 పశువుల షెడ్లు మంజూరయ్యాయి. ఒక్కో పశువుల షెడ్డుకు రూ.1.72 లక్షలకు పైగా నిధులు కేటాయించారు. రెండు షెడ్లను హడావుడిగా నిర్మించి బిల్లులు చేసుకున్నారు. మిగిలిన ఎనిమిది షెడ్లూ అసంపూర్తిగానే ఉన్నాయి. అయితే ఈ నిర్మాణాలన్నీ పూర్తి అయినట్లుగా టీడీపీ నేతలు రికార్డులు సృష్టించి రూ.లక్షల్లో బిల్లులు నొక్కేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈసీ కనుసన్నల్లోనే..
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అవినీతి మరే నియోజకవర్గంలోనూ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా బ్రహ్మసముద్రం మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఓ ఈసీ అంతా తానై టీడీపీ నేతలతో జత కట్టి అక్రమాలకు తెర లేపినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో సదరు ఈసీ ఏకంగా రూ.లక్షలను తన కుటుంబసభ్యుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేసుకున్న వైనంపై సాక్ష్యాధారాలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. అయితే సదరు ఈసీపై అక్రమాలపై చేపట్టిన విచారణను అధికారులు కాసులకు కక్కుర్తి పడి పక్కదోవ పట్టించినట్లుగా ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఈసీని గతంలో ఉన్నతాధికారులు టెంపరరీ అవుట్ ఆఫ్ కాంటాక్ట్ (టీఓసీ) లోకి పంపినా.. తిరిగి అదే మండలంలో విధులకు హాజరుకావడం గమనార్హం.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వ్యక్తి
గొంచిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న ఉపాధి అక్రమాలు, అవినీతిపై ఇటీవల ఓ వ్యక్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో నేరుగా కలెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేశాడు. దీంతో పశువుల షెడ్ల అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఇదంతా డ్వామా ఉన్నతాధికారులకు తెలిసినా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం కొసమెరుపు. అయితే లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడటంలో ఆంతర్యం ఏమిటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఉపాధి అధికారుల అండతో టీడీపీ నేతల అక్రమాలు
షెడ్లు నిర్మించకుండానే బిల్లులు చేసుకున్న వైనం
పక్కదారి పట్టిన రూ.లక్షల నిధులు
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుతో వెలుగు చూసిన అక్రమాలు
పై చిత్రంలోని ఈ నిర్మాణం ఉపాధి హామీ పథకం కింద బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లిలోని పూజారి హరీష్‌కు చెందిన పశువుల షెడ్డు. అసంపూర్తిగా ఉన్న ఈ కట్టడాన్ని పూర్తి చేసినట్లుగా రికార్డులు చూపి ఈ నెల 11న బోయ నాగమణి పేరిట రూ.1.72 లక్షలను అధికారులు మంజూరు చేశారు. స్థానిక టీడీపీ నేతలతో కుమ్మకై ్కన ఉపాధి హామీ పథకం ఈసీ.. మొత్తం నగదు డ్రా చేసినట్లుగా తెలుస్తోంది.


