జాతీయ స్థాయి సదస్సులో మోనాలిసా ప్రసంగం
వజ్రకరూరు: సామూహిక వనరుల సంరక్షణ అంశంపై హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ కార్యాలయంలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థ, ఫౌండేషన్ ఫర్ ఎకాలజికల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలోమంగళవారం నిర్వహించిన సదస్సులో వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా ప్రసంగించారు. సామూహిక వనరుల సంరక్షణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అందుబాటులో యూరియా
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా 5,860 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జేడీఏ ముదిగల్లు రవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రబీలో 27,232 మెట్రిక్ టన్నుల యూరియా లక్ష్యంగా కాగా, ఇప్పటికే 24,450 మెట్రిక్ టన్నులు సరఫరా అయిందన్నారు. ఇందులో పంపిణీ పోనూ ప్రస్తుతం 5,860 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వివరించారు. కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించినా, యూరియాను పక్కదారి పట్టించినా... అక్రమంగా నిల్వ చేసినా... ఎంఆర్‌పీకి మించి విక్రయాలు సాగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని ఎరువుల దుకాణదారులను హెచ్చరించారు.
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
బ్రహ్మసముద్రం : మహిళల ఆర్థికాభివృధ్దే లక్ష్యంగా ఆర్డీటీ పనిచేస్తున్నట్లు ఆ సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, మహిళా సాధికారత డైరెక్టర్ విశా ఫెర్రర్ అన్నారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో మంగళవారం బ్రహ్మసముద్రంలో ప్రీతి మహిళా పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ బ్యాంక్‌ను వారు ప్రారంభించి, మాట్లాడారు. స్వయం సమృద్ధి, స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాలతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా వారికి సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. సొంతంగా మహిళలే కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంక్ రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. అనంతరం మాంఛో ఫెర్రర్ దంపతులను స్వయం సహాయక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాగర్ మూర్తి, ఆర్‌డీలు సుబ్బారావు, మల్లికార్జున, ఏటీఎల్ ఓబులేసు, సుశీల, వెంకటేశులు, సీఓలు రామకృష్ణ, మలోబన్న, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న స్పెల్–బీ
జిల్లా స్థాయి పోటీలు
అనంతపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి స్పెల్–బీ పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో జిల్లాలోని 68 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంగ్లిష్ బాష ప్రాముఖ్యతను వివరించారు. డీఈఓ కార్యాలయ ఏడీ మునీర్ ఖాన్, డీసీఈబీ కార్యదర్శి గంధమనేని శ్రీనివాసులు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు. కాగా, జిల్లా స్థాయి పోటీల్లో ఆర్ నిఖిలేశ్వర్ ( 6వ తరగతి, ఏపీఎంఎస్ రాప్తాడు), ఎం.వెంకటలక్ష్మి (7వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, గొడసలపల్లి), టి.లిఖిత్ (8వ తరగతి, భార్గవ్ రైల్వే స్కూల్, గుంతకల్లు), పి నందిత (9వ తరగతి, ఎస్‌ఆర్కే మునిసిపల్ స్కూలు, గుంతకల్లు), జ్ఞాన సాయి స్వరూప్ (10వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, హవళిగి), వై.వీణామాధురి (జూనియర్ ఇంటర్, ఏపీఎంఎస్, యల్లనూరు), ఎస్. షనవాజ్ (ఏపీఎంఎస్, గార్లదిన్నె) విజేతలుగా నిలిచారు. వీరిని అభినందిస్తూ సర్టిఫికెట్లను డీఈఓ అందజేశారు. కాగా, జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన వారిని ఈ నెల 22న జరిగే జోనల్ స్థాయి పోటీలకు పంపనున్నారు.
పట్టపగలే బ్రాందీ షాపులో చోరీ
గుత్తి: స్థానిక ఆర్‌ఎస్‌లోని మెయిన్ బజారులో ఉన్న బ్రాందీ షాపులో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. ఉదయం 8.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్రాందీ షాపు వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించారు. క్యాష్ బాక్సులో ఉన్న రూ. 2,500 నగదు అపహరించారు. చోరీ చేసి బయటకు వస్తున్న సమయంలో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితులను హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన చోరీ చేస్తున్న దృశ్యాలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జాతీయ స్థాయి సదస్సులో మోనాలిసా ప్రసంగం
జాతీయ స్థాయి సదస్సులో మోనాలిసా ప్రసంగం


