పరిష్కార వేదికకు 122 వినతులు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 122 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కాగా, సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.
మహిళలు, చిన్నారుల సంరక్షణకు చర్యలు
జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతకు విస్తృత చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సంరక్షణా కార్యదర్శులను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సోమవారం పోలీసు కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సచివాలయాల పరిధిలోని ఇళ్లను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు. సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. డయల్ 100, 112 సేవలు, మహిళా, బాలికల రక్షణా చట్టాలు, శక్తియాప్‌లపై చైతన్య పరచాలన్నారు.


