ప్రభుత్వ విద్య మిథ్యే!
అనంతపురం: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్య మిథ్యగా మారిపోతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోయాయి. బడి బయటి పిల్లలను సైతం పట్టించుకోవడం లేదు. ఇదే క్రమంలో పైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 3,362 మంది విద్యార్థులు డ్రాపౌట్స్‌గా ఉన్నారు. ఒక్క అనంతపురం నగరంలోనే 820 మంది డ్రాపౌట్ కావడం విద్యా శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. గుంతకల్లులో 416, రాయదుర్గం 216, తాడిపత్రిలో 204, కళ్యాణదుర్గం పరిధిలో 154 మంది డ్రాపౌట్స్ ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఉపాధి కోసం పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు వలస వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ పాఠశాలలకు హాజరు కాకుండా తల్లిదండ్రుల వద్దే ఉంటూ చిన్నా,చితకా పనులకు వెళ్తున్నారు. వీరందరూ బడి బయట పిల్లలు.
డ్రాపౌట్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ఏదీ?
డ్రాపౌట్ పిల్లలకు ప్రత్యామ్నాయంగా విద్యను అందించాల్సిన గురుతర బాధ్యత పాఠశాల విద్యా శాఖదే. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. తరగతితో సంబంధం లేకుండా ఏ వయస్సులో ఉంటారో ఆ తరగతిలో నేరుగా అడ్మిషన్ కల్పించాల్సి ఉంటుంది. డ్రాపౌట్స్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలలను ఓ వైపు ప్రోత్సహిస్తూ.. మరో వైపు ప్రభుత్వ పాఠశాలలను విస్మరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం
చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోయేలా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా సంస్కరణలు అమలు చేసింది. ఈ క్రమంలోనే సీబీఎస్‌ఈ స్కూళ్లను ప్రవేశపెట్టారు. 2024 జూన్ నుంచి వీటిని ఒక్కొక్కటిగా చంద్రబాబు సర్కార్ రద్దు చేసింది. పేద పిల్లలను ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ‘టోఫెల్’ను రద్దు చేశారు. ఐబీ సిలబస్‌ను ఆరంభంలోనే నిలిపివేశారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడాన్ని ఆపేశారు. మన బడి నాడు–నేడు పనులను ఒక్క అడుగు కూడా మందుకు పడనీయలేదు. మధ్యాహ్న భోజనం నాణ్యతను గాలికి వదిలేశారు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో పెరిగిన చేరికలు
● 2024–25లో ఒకటో తరగతిలో 37,465 మంది విద్యార్థులు ఉండగా.. 2025–26 విద్యా సంవత్సరానికి 36,412 మందికి తగ్గిపోయారు. అంటే 1,053 మంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లారు. రెండో తరగతిలో 37,645 మంది ఉండగా, 36,828 మందికి తగ్గి, 637 మందిప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరారు. ప్రతి తరగతిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 4,38,247 మంది విద్యార్థులు ఉండగా, ఒక్క ప్రైవేట్ పాఠశాలల్లోనే 2,28,691 మంది చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2,09,556 మంది విద్యార్థులు చదువుతున్నారు. 10,500 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో కంటే అరకొరగా ఉపాధ్యాయులు ఉండే ప్రైవేట్ పాఠశాలల్లోనే అధికంగా విద్యార్థులు ఉండడం గమనార్హం.
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న ప్రవేశాలు
చంద్రబాబు ప్రభుత్వంలో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
బడి బయట పిల్లల పరిస్థితిని పట్టించుకోని దుస్థితి
3,362 మంది విద్యార్థులు వలస వెళ్లినా పట్టని విద్యాశాఖ


