యుగపురుషుడు యోగి వేమన
అనంతపురం కల్చరల్: తెలుగు జాతి యుగపురుషుడు యోగి వేమన జీవితం ఆదర్శప్రాయమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజాకవి వేమన జయంతి సోమవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న వేమన విగ్రహం వద్ద రెడ్డి సంఘాల ప్రతినిధులు, రచయితలు, కవులు, వివిధ రాజకీయపార్టీల నాయకులతో పాటు వందలాది మంది సాహితీ అభిమానులు నీరాజనాలర్పించారు. యోగి వేమన రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉదయం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటూ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి ఆత్మా రామిరెడ్డి, అనంత చంద్రారెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, సంఘం కార్యదర్శి ‘రూట్స్ స్కూల్’ గోపాలరెడ్డి, తదితరులు మాట్లాడారు. ఆటవెలది పద్యాలతో జన చైతన్యం తెచ్చిన సంఘ సంస్కర్త వేమన జీవితాన్ని అన్ని తరాల వారు గుర్తుంచుకునేలా విస్తృత ప్రచారం చేయాలని తీర్మానించారు. జయంతి, వర్ధంతులను రాష్ట్ర పండుగలా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో యోగా కేంద్రం అధ్యక్షులు మెళవాయి రాజశేఖరరెడ్డి, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజీఆర్ గోపాలరెడ్డి, నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


