శ్రుతిమించిన ఎమ్మెల్యే దగ్గుపాటి అరాచకాలు
● సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మండిపాటు
● ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా
అనంతపురం సెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన అనుచరుల అరాచకాలు మితిమీరిపోయాయని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మండిపడ్డారు. శనివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించిన అనంతరం అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే సీటు కోసం రూ. 30 కోట్లు, ఓట్ల కోసం రూ. 40 కోట్లు ఖర్చు చేశానని చెబుతూ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే దగ్గుపాటి దందాలు ప్రారంభించాడని ఆరోపించారు. సప్తగిరి సర్కిల్‌లోని అలెగ్జాండర్ హోటల్ నిర్వాహకులను బెదిరించాడని, మద్యం షాపుల నుంచి ముడుపులు డిమాండ్ చేయడంతో పాటు ఆశా హాస్పిటల్ స్థలాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి తాళాలు వేశాడన్నారు. శారదనగర్‌లో ఓ ఉపాధ్యాయురాలు చనిపోతే ఆమెకు చెందిన రూ. 3 కోట్ల ఆస్తిని రాంబందుల్లా పీక్కుతినాలని చూశారని దుయ్యబట్టారు. బుడగ జంగాల ప్రజలు పాత చీరలు అమ్ముకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్న మూడున్నర ఎకరాలను కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. టీడీపీకే చెందిన వీరశైవ లింగాయత్ చైర్మన్ స్వప్న 49 సెంట్ల స్థలాన్ని మింగేయాలని ఎమ్మెల్యే అనుచరుడు గంగారం చూశాడన్నారు. సూర్యనగర్ రోడ్డులో రజకులకు చెందిన రెండు కోట్ల ఆస్తిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. జనశక్తి నగర్‌లో టీడీపీ సాలార్‌బాషా సోదరుడు మక్బూల్ బాషాకు చెందిన 9 సెంట్ల స్థలంలో బండలు పాతారన్నారు. కళ్యాణదుర్గం రోడ్డులో బ్రాహ్మణులకు చెందిన 9 సెంట్ల స్థలాన్ని, రాజీవ్ కాలనీలో రెండున్నర ఎకరాలను కబ్జా చేశారని విమర్శించారు. తాజాగా ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని రూ. 20 లక్షలు ఇవ్వాలని బెదిరించడమే కాకుండా దాడులకు దిగారని, టీడీపీకే చెందిన నంబూరి వైన్స్ నిర్వాహకుడు వెంకటరమణను బెదిరించినా డబ్బులు ఇవ్వకపోవడంతో అనుచరులను ఉసిగొల్పి షాపునకు నిప్పు పెట్టించాడన్నారు. ఎమ్మెల్యే అరాచకాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి చర్యలు తీసుకోవాలని, భూకబ్జాలు, దౌర్జన్యాలు చేస్తున్న వారిని జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈనెల 25న అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ జగదీష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమణ, పద్మావతమ్మ, లింగమయ్య, సంతోష్‌కుమార్, కుళ్ళాయిస్వామి, నగర సహాయ కార్యదర్శి కృష్ణుడు, అల్లీపీరా, నారాయణస్వామి, రామాంజనేయులు, రాజు, శ్రీనివాస్, ఏఐఎస్‌ఎఫ్ నగర కార్యదర్శి ఉమా మహేష్, మంజునాథ్, ఆనంద్, శ్రీనివాసు, యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.


