రాష్ట్ర స్థాయి రిపబ్లిక్ డే శిబిరానికి ఎంపిక
గుమ్మఘట్ట: రాష్ట్ర స్థాయి రిపబ్లిక్ డే శిబిరానికి ముగ్గురు ఎన్‌సీసీ విద్యార్థినులు ఎంపికై నట్లు రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్న ఆసియాబాను,బి.లీలావతి, బి.సుప్రియ ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఒకే విభాగం నుంచి ముగ్గురు విద్యార్థినులు ఎంపిక కావడం కళాశాల చరిత్రలో మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ఈ నెల 26న విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకోనున్నట్లు వివరించారు. సీటీఓ కిరణ్ మాట్లాడుతూ విద్యార్థినులు పట్టుదలతో శిక్షణ పొంది ఈ స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుని రాయదుర్గం ఖ్యాతిని ఇనుమడింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకుల బృందం ఎంపికైన విద్యార్థినులను ఘనంగా సత్కరించి అభినందించారు.


