ఈ–క్రాప్ చేసుకున్న వారి నుంచే కందుల కొనుగోలు
కూడేరు: ఈ–క్రాప్ చేసుకున్న రైతుల నుంచి మాత్రమే కందులను కొనుగోలు కేంద్రాల్లో సేకరిస్తారని జిల్లా వ్యవసాయాఽధికారి(డీఏఓ) ఎం.రవి స్పష్టం చేశారు. శుక్రవారం కూడేరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని వ్యవసాయ గోదాములో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. డీఏఓ రవి ముఖ్య అతిథిగా విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరితో కలిసి డీఏఓ కందుల కొనుగోలు నిబంధనలను రైతులకు వివరించారు. క్వింటా రూ.8 వేలుతో కొనుగోలు చేస్తామని చెప్పారు. కంది గింజల్లో తేమ 12 శాతం ఉండాలన్నారు. రవాణా ఖర్చులను రైతులే భరించాలన్నారు. కొనుగోలు చేసిన 10 రోజుల లోపు రైతుల ఖాతాల్లోకి నగదు జమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, ఏఓ శుభకర్, ఏఈఓలు దిలీప్, రాఘవేంద్ర, కందులు కొనుగోలు ఏజెన్సీ నిర్వాహకుడు చింతలనాయుడు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పంటలకు సోకే తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని డీఏఓ రవి సూచించారు. గొటుకూరులో శుక్రవారం ఆయన పర్యటించారు. సాగైన శనగ పంటను పరిశీలించారు. తెగుళ్ల నివారణ మందులు పిచికారీ కంటే ముందు పంటలకు సూక్ష్మ పోషకాలను తప్పనిసరిగా అందించాలన్నారు. అనంతరం రైతు సేవ కేంద్రాన్ని సందర్శించారు.


