దొరకని చిరుత.. జనం కలవరం
తాడిపత్రి రూరల్: మండలంలోని తలారిచెరువు – ఊరుచింతల సమీపాన లైమ్‌స్టోన్ గనుల వద్ద రెండు రోజుల కిందట కనిపించి.. మాయమైన చిరుత ఆచూకీ కనిపించలేదు. చిరుత ఎటువైపు నుంచి ఎలా వస్తుందోనన్న భయం తలారిచెరువు, ఊరుచింతల, ఆలూరు, వెలమకూరు గ్రామాల ప్రజలు, కార్మికులను భయకంపితులను చేస్తోంది. చిరుత సంచారం వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై వీడియో తీసిన కార్మికుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చిరుత సంచారం నిజమేనని రూఢీ చేసుకున్న అధికారులు చర్యలకు ఉపక్రమించారు. చిరుత ఆచూకీ కనుగొని అటవీ ప్రాంతంలోకి పంపించేందు కోసం ముచ్చుకోట ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ జగన్నాథ్, సిబ్బంది రెండు రోజులుగా కొండలు, గుట్టలు గాలిస్తున్నారు. అయినా ఎక్కడా జాడ కనిపించలేదు. చిరుత భయంతో ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులు రాత్రి సమయాల్లో విధులకు వెళ్లడానికి జంకుతున్నారు. చిరుత ఎక్కువగా గొర్రెల మంద, పశువులపై దాడి చేస్తాయని, కాపలాదారులు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుత ఆచూకీ దొరికేవరకు కొండలు, గుట్టల ప్రాంతాల్లోకి మేపడానికి తీసుకెళ్లకుంటే మంచిదని సూచిస్తున్నారు. చిరుత ప్రభావం ఎక్కువగా తలారిచెరువు, ఊరుచింతలపై ఉండటంతో ఫారెస్టు సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టారు. రెండు గ్రామాల్లోని ప్రజలు, విద్యార్థులతో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీతోపాటు సోలార్, విండ్ మిల్స్ ఉద్యోగులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నారు.
అక్కడి నుంచి వచ్చుండొచ్చు!
తలారిచెరువు – ఊరుచింతల గ్రామాలకు వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దుగా ఉంది. వైఎస్సార్ కడపజిల్లా సరిహద్దులోని దొంగుడుపల్లి ఉంది. ఈ గ్రామం కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఆ ప్రాంతమంతా ఫారెస్టును కలిగి ఉండటం, చిరుతల సంచారం కూడా ఉండటంతో అక్కడి నుంచి చిరుత వచ్చి ఉండవచ్చని ఫారెస్టు సిబ్బంది అనుమానిస్తున్నారు. తలారిచెరువు, ఊరుచింతల సమీపంలో జింకలు ఎక్కువగా ఉండటం, అవి దొంగుడుపల్లి ఫారెస్టు సమీపానికి వెళ్లడం వల్ల ఆక్కడున్న చిరుత జింకను తరుముకుంటూ ఇక్కడికి వచ్చి ఉండవచ్చన్న భావిస్తున్నారు.
రెండు రోజుల క్రితం కనిపించిన చిరుత, ఊరుచింతల కొండల్లో చిరుత కోసం గాలిస్తున్న ఫారెస్టు సిబ్బంది
దొరకని చిరుత.. జనం కలవరం


