రాష్ట్రం దూసుకెళ్తున్నది అప్పుల్లోనే
ఉరవకొండ: రాష్ట్రం అప్పుల్లో దూసుకెళ్తోందని, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉరవకొండలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల కమిటీలు, పార్టీ ముఖ్యనేతల సమావేశం వజ్రకరూరు మండల కన్వీనర్ సోమశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నియోజవకవర్గంలో పార్టీ ఆర్గనైజింగ్ బలంగా ఉండేందుకు ప్రతి కార్యకర్తా సైనికుల్లా పనిచేయాలన్నారు. ఫిభ్రవరి 15లోగా గ్రామ కమిటీలు పూర్తి చేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3లక్షలకోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఎన్నికల హామీల అమలు విస్మరించడం, రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తుండటంతో ప్రభుత్వంపై ప్రజల్లోతీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3లక్షల కోట్లు అప్పు చేస్తే అందులో డీబీటీ, నాన్‌టీబీటీ, అభివృద్ది, సంక్షేమ పథకాలకు వినియోగించిందని గుర్తు చేశారు. గత పాలన, ప్రస్తుత పాలనను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను వైఎస్సార్‌సీపీ నాయకులు గుర్తించి.. పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కోతల రాయుడు మంత్రి కేశవ్
ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ కోతల రాయుడుగా మారారని విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని తానే అభివృద్ది పథంలో నడుపుతున్నానని, తానే ఉరవకొండకు మొదటి కూలీ అవుతానని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. హంద్రీ–నీవా వైడనింగ్ పనుల పేరిట రూ.750 కోట్లు ఖర్చు పెట్టి సొంత జేబులు నింపుకున్నారన్నారు. కమీషన్ల కోసమే కొన్ని పనులు చేపడుతూ హడావిడి చేస్తున్నారన్నారు. కమీషన్ల కోసం మూలనపడ్డ సూక్ష్మసేద్యం పనులను మళ్లీ ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి సీపీ వీరన్న, ఎంపీపీలు నరసింహులు, నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, శ్యాం, బెళుగుప్ప, ఉరవకొండ, కూడేరు, విడపనకల్లు మండలాల సమన్వయకర్తలు మచ్చన్న, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, బైరెడ్డి రామచంద్రారెడ్డి, కురుబ డొనేకల్లు రమేష్, పార్టీ రాష్ట్ర నాయకులు ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, యోగేంద్రరెడ్డి, డిష్ సురేష్, కడమలకుంట రామ్మోహన్, ధనంజయ, ముస్టూరు వీరేష్, మల్లి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పోరాడాలి
వైఎస్సార్‌సీపీ నేతల సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి పిలుపు


