గృహ నిర్మాణ సంస్థలో ఇంజినీర్ల కొరత
అనంతపురం టౌన్: గృహ నిర్మాణ సంస్థలో డివిజనల్ ఇంజినీర్ల కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది నియోజకవర్గాలుంటే నలుగురు మాత్రమే డివిజనల్ ఇంజినీర్లు విధులు నిర్వహిస్తున్నారు. డీఈల కొరతతో ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. శింగనమల, రాయదుర్గం నియోజకవర్గాలకు రామమూర్తి, అనంతపురం, రాప్తాడుకు శ్రీమన్నారాయణ, గుంతకల్లు, తాడిపత్రికి షాషావలి, ఉరవకొండకు హనుమప్ప, కళ్యాణదుర్గానికి విజయభాస్కర్ డీఈలుగా పని చేస్తున్నారు. ఆరు నియోజకవర్గాలకు ముగ్గురు డీఈలు ఇన్‌చార్జ్‌లుగా పని చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. వెంటనే అధికారులు స్పందించి డివిజనల్ ఇంజినీర్ల కొరతను పరిష్కరించి రెగ్యులర్ డీఈలను నియమించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజను వివరణ కోరగా.. డీఈలు కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో భర్తీ చేసే అవకాశం ఉందన్నారు.
సంక్రాంతికి టికెట్ రేట్లు పెంచితే చర్యలు
అనంతపురం సెంట్రల్: సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సుల్లో టికెట్లను అధిక ధరలకు విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) వీర్రాజు హెచ్చరించారు. శుక్రవారం ఆయన చాంబర్‌లో ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రైవేటు యజమానులు నిర్దేశించిన ధరల వివరాలను అభి బస్, రెడ్‌బస్ లాంటి యాప్‌ల ద్వారా రవాణా శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుందని, అధిక ధరలు వసూలు చేసే ట్రావెల్స్ యజమాన్యాలపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం, ఇతర ట్రాన్సాక్షన్ చేసుకునే ట్రాన్స్‌పోర్టు వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌లను అమర్చుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్టీఓ సురేష్‌నాయుడు, పలు ట్రావెల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
‘డబుల్ ట్రబులర్’
రమణరావుకు పోస్టింగ్
● సస్పెండైన మూడునెలలకే విధుల్లోకి
అనంతపురం టౌన్: డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి అనంతపురం నగరంలో భూ వివాదాలకు ఆజ్యం పోసి సస్పెండ్ అయిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రమణరావుకు ఉన్నతాధికారులు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. డబ్బులు ఇస్తే చాలు ఎలాంటి రిజిస్ట్రేషన్లనైనా రమణరావు ఇట్టే చేసేస్తారు. ఆయన చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లపై గత ఏడాది సెప్టెంబర్ 29న ‘సాక్షి’ దినపత్రికలో ‘డబుల్ ట్రబులర్ రమణే’ శీర్షికన కథనం వెలువడడంతో విచారణ చేపట్టిన రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు అక్టోబర్ 7న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురంలో ఇష్టారాజ్యంగా ఆయన చేసిన రిజిస్ట్రేషన్లతో నేటికీ నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగులకు ఆరు నెలలు దాటిన తర్వాతే ఏ శాఖలోనైనా పోస్టింగ్ ఇస్తారు. అలాంటిది మూడు నెలలకే సస్పెన్షన్ ఎత్తివేసి జనవరి 4న చిత్తూరు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రమణ రావుకు పోస్టింగ్ ఇవ్వడంపై ఆ శాఖ ఉద్యోగులే నివ్వెర పోతున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారిని ప్రసన్నం చేసుకోవడంతో మూడు నెలల కాలంలోనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాడంటూ ఉద్యోగులలో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మిని వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు చిత్తూరు ఆర్‌ఓకు పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఆమె తేల్చి చెప్పారు.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ప్రచార విభాగంలో ఇద్దరికి చోటు కల్పించారు. అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గాలకు చెందిన మూలి దినేష్‌రెడ్డి, వక్కాకుల కిరణ్‌కుమార్ రాయల్‌ను ప్రచార విభాగం జిల్లా కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.
గృహ నిర్మాణ సంస్థలో ఇంజినీర్ల కొరత


