అరాచకం సాగిస్తామంటే కుదరదు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్
అనంతపురం: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తామంటే కుదరదని టీడీపీ నేతలను వైఎస్సార్‌సీపీ బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కార్యదర్శి సి. రమేష్‌గౌడ్ హెచ్చరించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, లీగల్ సెల్ నాయకులతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతపురంలోని గుల్జార్‌పేటతో రోడ్డు విస్తరణలో భాగంగా టీడీపీ జెండా దిమ్మెను తొలగిస్తే.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ కుమారుడు దాదును స్టేషన్‌కు తీసుకెళ్లిన అంశాన్ని ప్రశ్నించేందుకు వెల్లిన పార్టీ ముఖ్య నాయకులపై సీఐలు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఒకరేమో కాల్చిపారేస్తాం నా కొడకా అంటే.. ఇంకొకరేమో 200 మందిని దించుతామంటూ బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. ఈ విషయంలోనే తనతో పాటు మరో 23 మంది ముఖ్య నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశామని.. ఢిల్లీలోనూనిరసన తెలిపామని కానీ ఏ రోజూ పోలీసులు ఇలా వ్యవహరించింది లేదన్నారు. కేసులు ఎందుకు నమోదు చేశారు.. దాదును ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్నది పోలీసులు చెప్పి ఉంటే అసలు వివాదమే ఉండేది కాదన్నారు. అలా చేయకుండా అసలు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లడమే తప్పు అనే విధంగా వ్యవహరించారన్నారు. టీడీపీ నేతలకు వర్తించని 30 యాక్ట్ వైఎస్సార్‌సీపీ నేతలకు మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. కనీసం నూతన సంవత్సరం నుంచైనా పోలీసులు పనితీరు మారాలని.. న్యాయం వైపు నిలబడి చట్ట ప్రకారం పని చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు సైతం కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పొట్టెళ్లను కొడవళ్లతో నరికితేనే ఈ సెక్షన్ ఉపయోగిస్తే.. జాతర్లు జరిగినప్పుడు కూడా అందరిపై కేసులు పెట్టాల్సి ఉంటుందన్నారు. అఖండ –2 సినిమా విడుదల సమయంలో వందల మంది అభిమానుల సమక్షంలో పొట్టేళ్లు కొట్టి.. వాటి తలలతో బాలకృష్ణ కటౌట్‌కి హారంగా వేశారన్నారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్, శ్రీరామ్‌ను ఊరేగిస్తున్నప్పుడు వందలాది మంది జనం మధ్య పొట్టేళ్ల తలలు నరికారన్నారు. మరి ఆయా ఘటనలపై మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అక్రమ కేసులను ఎదుర్కొంటామని.. అలాగే పోలీసులపై కూడా కేసులు పెట్టి.. కోర్టుకు రప్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న, రాజశేఖర్ యాదవ్, బెస్త వెంకటేశులు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి టి. నరేంద్ర, సాకే విక్రం, వెంకటేష్, మోహన్, గణేష్ , జిల్లా యువజన సెక్రెటరీ హిదయ్ తుల్లా, దాదు తదితరులు పాల్గొన్నారు.


