జీవాల పెంపకం లాభదాయకం
ఉరవకొండ: జీవాల పెంపకం చేపడితే లాభాలు బాగుంటాయని, గొర్రెలు, పొట్టేళ్ల పెంపంకం దృష్టి సారించాలని స్టేక్‌హోల్డర్స్‌కు సెర్ఫ్ డైరెక్టర్ పద్మావతి సూచించారు. మీట్ ప్రాసెసింగ్‌పై మంగళవారం ఉరవకొండలోని వెలుగు కార్యాలయంలో స్టేక్‌హోల్డర్స్‌కు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఆర్‌డీఏ పీడీ శైలజ తో కలసి ఆమె మాట్లాడారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద జిల్లా లో ఫుడ్ ప్రాసింగ్ యూనిట్లు వంద మంజూరయ్యాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, పొట్టేళ్లు పెంపకం చేపట్టి ఆర్థిక పురోగతి సాధిస్తున్నారని, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఆర్థిక చేయూతనందించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ ఏడీ పెద్దన్న, వెలుగు ఏసీ శివప్రసాద్, ఏపీఎం శివయ్య పాల్గొన్నారు.
గార్మెంట్స్ పరిశ్రమపై ఆసక్తి చూపాలి
గార్మెంట్స్ పరిశ్రమ ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు దక్కుతాయని మహిళా సంఘాల సభ్యులకు సెర్ఫ్ డైరెక్టర్ పద్మావతి సూచించారు. ఉరవకొండలో గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరో ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి టైలరింగ్‌లో అనుభవమున్న మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● 32 ద్విచక్ర వాహనాల స్వాధీనం
కళ్యాణదుర్గం రూరల్: అంతర్రాష్ట్ట దొంగలను అరెస్ట్ చేసి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ఇటీవల కళ్యాణదుర్గం నియోజవర్గం వ్యాప్తంగా ప్రధాన సర్కిళ్లలో నిలిపిన ద్విచక్ర వాహనలను దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో కళ్యాణదుర్గంలోని కుందుర్పి రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని మంగళవారం అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న వైనం వెలుగుచూసింది. పట్టుబడిన వారిలో కుందిర్పి మండలం బోదపల్లి గ్రామానికి చెందిన బోయ పాతన్న, అనంతపురంలోని పాపంపేటకు చెందిన బోయ చిన్నబాబు ఉన్నారు. అపహరించిన ద్విచక్ర వాహనాలను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న పాత భవనంలో దాచినట్లుగా వెల్లడించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మొత్తం 32 ద్విచక్ర వాహనాలను స్వాధీన చేసుకుని పీఎస్‌కు తరలించారు. వీటి విలువ రూ 22.80 లక్షలుగా ఉంటుందని నిర్దారించారు. కాగా, పట్టుబడిన నిందితులు పాత నేరస్తులే. వీరిపై అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోని పావగడలోనూ పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.


