ఒత్తిడికి గురి చేస్తే మెరుగైన ఫలితాలు ఎలా సాధ్యం?
అనంతపురం సిటీ: రకరకాల యాప్‌లు, రోజుకో కొత్త కార్యక్రమంతో విద్యార్థులు, ఉపాధ్యాయులను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తే మెరుగైన ఫలితాలు ఎలా సాధ్యమవుతాయని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతపురం ఆదిమూర్తినగర్‌లోని ఉపాధ్యాయ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఏపీటీఎఫ్ జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి నరసింహులు, జిల్లా పూర్వ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడారు. యాప్‌ల నమోదు, వంద రోజుల ప్రణాళిక లాంటివి పక్కాగా అమలు చేయాలని ఒత్తిడికి గురి చేయడం తగదన్నారు. పైగా ఇతర శాఖల అధికారులకు తమపై పెత్తనం చెలాయించే అధికారం ఇవ్వడం దుర్మార్గపు ఆలోచనని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాలను పునరాలోచించుకోవాలని, లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి సబ్ కమిటీ సభ్యులు తరలివచ్చారు.
హోరాహోరీగా
క్రికెట్ మ్యాచులు
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ఏఎస్‌ఏ ఉమెన్స్ కప్ టోర్నమెంట్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. ఏఎస్‌ఏ జట్టుపై సౌతర్న్ స్ట్రైకర్స్ జట్టు 3 వికెట్లతో, కడపపై మయూఖా అకాడమి 4 వికెట్లతో, ఏవీ ఎన్‌సీఏ జట్టుపై 7 వికెట్ల తేడాతో సంప్రసిద్ధి అకాడమి జట్లు విజయం సాధించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా సలోని (సంప్రసిద్ధి), షేక్ ముబీన (మయూకా), గీతిక కొడాలి (సౌతర్న్ స్ట్రైకర్స్) నిలిచారు. వారికి జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్‌రెడ్డి, సీనియర్ మహిళా క్రీడాకారిణిలు లతాదేవి, రాధిక మెమోంటోలను అందజేశారు.
జాతీయస్థాయి
ఖోఖో పోటీలకు ఎంపిక
వజ్రకరూరు: మండల పరిధిలోని చిన్నహోతురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆర్.భార్గవి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, పీడీ ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లా పంగలూరులో జరిగిన అండర్ 18 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో భార్గవి ప్రతిభ కనబరచినట్లు చెప్పారు. ఈనెల 31 నుంచి బెంగళూరులో జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీలకు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్.భార్గవిని వారు అభినందించారు.
కడుపునొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య
యాడికి: కడుపు నొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుడిపాడులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి భార్య మల్లేశ్వరి వివరాలమేరకు... గుడిపాడుకు చెందిన తలారి వెంకటేష్ కుమారుడు శ్రీనివాసులు (35)కు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరానికి చెందిన మల్లేశ్వరితో వివాహమైంది. గనుల్లో లారీడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు గత ఏడాది నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి తీవ్రం కావడంతో ప్రస్తుతం పనులకు వెళ్లడంలేదు. శనివారం భార్య, ఇద్దరు కుమారులను కొలిమిగుండ్ల మండలం బి.తాడిపత్రిలోని పిన్నమ్మ ఊరికి పంపిన శ్రీనివాసులు ఇంట్లో ఉండిపోయాడు. ఆదివారం ఉదయం ఆరు గంటల వరకూ నిద్రలేకపోవడంతో పక్క ఇంట్లో ఉన్న వెంకటేష్ వాకిలి తెరచి చూశారు. అప్పటికే శ్రీనివాసులు ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ బోలా..
యువకుడి మృతి
శింగనమల (నార్పల): నార్పల మండలంలోని పులసలనూతల గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి పల్లె మహేంద్ర (22) మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... పులసలనూతలకు చెందిన పల్లె సూర్యనారాయణ కుమారుడు మహేంద్ర తన ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలోని మట్టిని తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో మహేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. మహేంద్రకు రెండు సంవత్సరాల క్రితం వివామైంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు.
ఒత్తిడికి గురి చేస్తే మెరుగైన ఫలితాలు ఎలా సాధ్యం?
ఒత్తిడికి గురి చేస్తే మెరుగైన ఫలితాలు ఎలా సాధ్యం?


