హామీలు నెరవేర్చాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండ్
అనంతపురం అర్బన్: ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారు. వాటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నలప్ప డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గణేనాయక్ భవన్‌లో నగర కమిటీ సభ్యుడు మసూద్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చారని, అయితే వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పారన్నారు. అర్హులకు పింఛను, రేషన్ కార్డులతో పాటు 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి పింఛను ఇస్తామని చెప్పినా అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పట్టించుకోలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లను పూర్తి చేసి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాన్నారు. రెండేళ్లు అవుతున్నా ఒక్కరికై నా ఇచ్చారా? అని ప్రశ్నించారు. నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో నగరాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. సమావేశంలో నాయకులు బాలరంగయ్య, వెంకటనారాయణ, ముర్తుజా, ప్రకాష్, ఇర్ఫాన్, గోపాల్, లక్ష్మినరుసమ్మ, అశ్విని, తదితరులు పాల్గొన్నారు.


