డీఐజీ షిమోషికి పదోన్నతి
అనంతపురం సెంట్రల్: అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి పదోన్నతి దక్కింది. 2008 ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన ఆమెకు ఐజీగా పదోన్నతిగా కల్పిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు రాలేదు. దీంతో మరికొంత కాలం డీఐజీగానే ఆమె కొనసాగనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
రేపు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దాని రసీదు తీసుకురావాలన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా తెలియజేయవచ్చన్నారు.
10 మంది సిబ్బంది మించితే ఈఎస్‌ఐ పరిధిలోకే
అనంతపురం కార్పొరేషన్: షాపులు, వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్లు, లాడ్జీలు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, పాఠశాలలు, కళాశాలలు తదితర వ్యాపార సముదాయాలు ఏవైనా పది మందికి మించి సిబ్బంది పనిచేస్తుంటే.. ఆ సంస్థలు కార్మిక రాజ్య బీమా సంస్థ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ – ఈఎస్‌ఐసీ) పరిధిలోకి వస్తాయి. ఆయా సంస్థలు వెంటనే శ్రమ సువిధ/ ఎంసీఏ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’ అని అనంతపురం ఈఎస్‌ఐసీ బ్రాంచ్ మేనేజర్ జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గతంలో ఉన్న బకాయిల పరిశీలన, జరిమానా లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగులు, సంస్థలు సోషల్ సెక్యూరిటీ, ఉచిత వైద్య సేవలు, బీమా, ప్రమాద భద్రత, తదితర సంక్షేమ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు నగరంలోని ఈఎస్‌ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
ముక్కోటి ఏకాదశి
ఏర్పాట్లు షురూ..
ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు షురూ అయ్యాయి. రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో వేడుకల నిర్వహణపై సందిగ్ధత నెలకొనడంపై ఈ నెల 26న ‘పెన్నహోబిలంపై నిర్లక్ష్యమేల’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి తిరుపతి దేవదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ స్పందించారు. పెన్నహోబిలంలో ముక్కోటి ఏకాదశి నిర్వహించడానికి జిల్లా దేవదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జునప్రసాద్‌ను ఇన్‌చార్జ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించి, ముక్కోటి ఏకాదశి వేడుకలపై ఆలయ సిబ్బందితో సమీక్షించారు. అనంతరం వేడుకలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
డీఐజీ షిమోషికి పదోన్నతి


