పడకేసిన పారిశ్రామిక ప్రగతి
అనంతపురం టౌన్: ప్రోత్సాహక రాయితీలు అందకపోవడంతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతోంది. పరిశ్రమల విస్తృత ఏర్పాటుతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో ఎంతోమంది యువ పారిశ్రామిక వేత్తలు విస్తృతంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈల)ను ఏర్పాటు చేశారు. అయితే వారికి ప్రభుత్వం రాయితీలు మాత్రం అందడం లేదు. ఏడాదిన్నర కాలంగా పారిశ్రామికవేత్తలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
పారిశ్రామిక వేత్తలపై చిన్నచూపు
జిల్లాలో 2023–27 పారిశ్రామిక పాలసీ కింద రూ.600 కోట్లకు పైగా పెట్టుబడులతో 1,200 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎంఎస్‌ఎంఈల)ను ఏర్పాటు చేశారు. వీటిద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా మరో 1500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంత పెద్ద ఎత్తున యూనిట్లు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పారిశ్రామిక వేత్తలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఏడాదిన్నర కాలంగా రాయితీలు మంజూరు చేయకపోవడంతో పారిశ్రామిక వేత్తలు అవస్థలు పడుతున్నారు. రాయితీల రూపంలో చిన్న పరిశ్రమలకు మాత్రమే రూ.50 కోట్ల మేర మంజూరు చేయాల్సి ఉంది. పెద్ద తరహా పరిశ్రమలు జిల్లాలో 17 ఉన్నాయి. వీటికి సైతం ప్రోత్సహకాలు సకాలంలో అందడం లేదు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
పరిశ్రమలు (యూనిట్లు) నెలకొల్పిన పారిశ్రామికవేత్తలకు రాయితీలు అందని మాట వాస్తవమే. జిల్లా వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా రాయితీలు రావాల్సి ఉంది. పరిశ్రమ వివరాలు, యూనిట్ కాస్ట్, ఉపాధి తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఇక రాయితీలపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అక్కడి నుంచి రాయితీలు మంజూరైతే పారిశ్రామికవేత్తల ఖాతాల్లో నేరుగా జమవుతుంది.
– శ్రీనివాసయాదవ్, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ
పారిశ్రామికవేత్తలకు అందని రాయితీలు
1200 పరిశ్రమలకు రూ.50 కోట్ల మేర బకాయిలు
ఏడాదిన్నరగా పారిశ్రామిక వేత్తల ఎదురుచూపు
మీనమేషాలు లెక్కిస్తున్న చంద్రబాబు సర్కారు


