అతివేగం.. తీసింది ప్రాణం
● ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకుల దుర్మరణం
● ముగ్గురికి తీవ్రగాయాలు
గుత్తి రూరల్: మండలంలోని ఊబిచెర్ల గ్రామం సమీపంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఆటోను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో పెద్దవడుగూరు మండలం మిడుతూరుకు చెందినరెడ్డి పోగుల రాజేష్(32), కొయిలదిన్నె నవీన్(25) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రాజేష్ నంద్యాల జిల్లా ప్యాపిలిలో, నవీన్ ప్యాపిలి మండలం రోళ్లపాడు గ్రామంలో వివాహం చేసుకున్నారు. అయితే రాజేష్ భార్య కళావతి, నవీన్ భార్య స్వీటీ క్రిస్మస్‌కు పుట్టినిళ్లకు వెళ్లారు. రాజేష్, నవీన్ వారి భార్యలను పిలుచుకొని ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే పోదొడ్డి గ్రామ శివారులో హైదరాబాదు నుంచి బెంగళూరు వైపునకు వెళ్తున్న కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న రాజేష్, నవీన్, కళావతి, స్వీటీ, వర్ష తీవ్రంగా గాయపడ్డారు. హైవే అంబులెన్స్ ద్వారా వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్ అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నవీన్ అనంతపురం తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఆటో రోడ్డు పక్కన వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న లారీని ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయబోయి కారు ఆటోను ఢీకొన్నట్లు బాధితులు తెలిపారు. మృతులు రాజేష్‌కు భార్య కళావతి, కుమార్తె వర్ష, నవీన్‌కు భార్య స్వీటీ ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్, కారును పోలీసులు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శోకసంద్రంలో మిడుతూరు
పెద్దవడుగూరు : నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన నవీన్(23), రాజేష్(35) మృతి చెందడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన భర్తల మరణాన్ని భార్యలు కళావతి, స్వీటి జీర్ణించుకోలేక పోతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు.
మృతులు రాజేష్, నవీన్
అతివేగం.. తీసింది ప్రాణం


