చేనేత మగ్గాలకు నిప్పు
తాడిపత్రిటౌన్: పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు చేనేత మగ్గాలకు నిప్పుపెట్టారు. వివరాలు.. నరసాపురం చేనేత సోసైటీ కింద దాదాపు 30 మగ్గాలు ఉన్నాయి. అయితే మగ్గాలు ఉంచిన షెడ్డుకు దుండగులు నిప్పుపెట్టారు. అక్కడే నిద్రిస్తున్న రంగయ్య అనే వ్యక్తి మంటలను గుర్తించి కేకలు వేయగా దుండగులు పారిపోయారు. వెంటనే గ్రామస్తులు వచ్చి మంటలు ఆర్పేశారు. అయితే అప్పటికే రెండు మగ్గాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో రూ.50 వేలు నష్టం వాటిల్లినట్లు సొసైటీ నిర్వాహకుడు రమేష్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.


