మిగులు భూమిగా చూపి.. | - | Sakshi
Sakshi News home page

మిగులు భూమిగా చూపి..

Dec 28 2025 7:37 AM | Updated on Dec 28 2025 7:37 AM

మిగులు భూమిగా చూపి..

మిగులు భూమిగా చూపి..

పచ్చజెండా పాతి..

రాప్తాడురూరల్‌: కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే కారణంతో ఇద్దరు రైతులపై టీడీపీ నేతలు కక్షగట్టి వారి పొలాలను లాక్కుకునేందుకు యత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండలం పుల్లలరేవు గ్రామానికి చెందిన బోయకులానికి చెందిన ఎస్‌. గోవిందు కుటుంబం గొందిరెడ్డిపల్లి పొలం 7.76 ఎకరాల గాజుబండ పొరంబోకు భూమిని దాదాపు 40 ఏళ్లుగా సాగుచేసుకుంటోంది. 2001 మార్చిలో ఈ భూమిని అసెస్డ్‌ వేస్ట్‌ (ఏడబ్ల్యూ)ల్యాండ్‌గా కన్వర్షన్‌ చేయాలంటూ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అప్పటి తహసీల్దార్‌ ఈమేరకు సిఫార్సు చేస్తూ ఆర్డీఓకు లేఖ రాశారు. అప్పట్లో ఆర్డీఓ ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో 2006లో ఎస్‌.గోవిందుకు 103–2 (కొత్త సర్వేనంబరు)లో 4.90 ఎకరాలు, 2007లో గోవిందు పెద్ద కుమారుడు ఎస్‌.పెద్ద ఓబులేసుకు 103–3 సర్వే నంబరులో 2.86 ఎకరాల భూమికి వ్యవసాయ భూమి పట్టాలు మంజూరు చేశారు. గోవిందు చనిపోవడంతో ఆయన పేరుపై ఉన్న 4.90 ఎకరాలను చిన్న కుమారుడు ఎస్‌.వసంతు పేరుపై పట్టాదారు పాస్తుకంతో పాటు ఆన్‌లైన్‌లో ఎక్కించారు. ఆరు బోర్లు వేయడంతోపాటు పైపులైను, డ్రిప్‌ ఏర్పాటు చేశారు. పంట రుణాలు, ఎల్‌టీ లోన్లు తీసుకున్నారు. కరెంటు బిల్లులు కడుతున్నారు. చింతచెట్లు, నేరేడు, టెంకాయచెట్ల పెట్టడంతోపాటు అంతర పంటలూ సాగు చేస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే...

2024లో టీడీపీ అధికారంలోకి రాగానే ‘ఇది పొరంబోకు’ భూమి అంటూ గ్రామంలో ఉన్న కొందరు టీడీపీ నాయకులు పెద్ద ఓబులేసు, వసంతు భూముల్లో టీడీపీ జెండా నాటారు. తర్వాత కొద్దిరోజులకు కొన్ని నేరేడు చెట్లను తొలగించారు. ఆ తర్వాత టెంకాయచెట్లకు నిప్పుపెట్టారు. దీనిపై రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఇక మూడోసారి ఏకంగా మొత్తం చెట్లన్నీ తొలగించడంతో పాటు పైపులైను, మోటార్లను తొలగించి అగ్గిపెట్టారు. మరీబరి తెగిస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కొత్తగా మొక్కలు నాటుకునేందుకు తనవంతు ఆర్థికసాయం అందిస్తానని భరోసా కల్పించారు.

గత నెలలో నోటీసు ఇచ్చిన అధికారులు

పెద్ద ఓబులేసు, వసంతు పేర్లు ఆన్‌లైన్‌లో తొలగించాలంటూ గ్రామానికి చెందిన ఎం.రమేష్‌, టి.కృష్ణయ్య, యు.జయప్ప, సి.శంకర్‌, కె.కృష్ణయ్య, సి.నల్లప్ప, సాయినాథ్‌నాయుడు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో గత నెలలో వారిద్దరికీ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసు అందుకున్న బాధితులు జిల్లా, హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారులు, రెవెన్యూ అధికారులకు హైకోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో వారు వెంటనే అధికారులపై ఒత్తిళ్లు చేయించి మరీ ఆన్‌లైన్‌ నుంచి రైతుల పేర్లు తీయించేశారు. 7.76 ఎకరాల భూమిని మిగులు భూమిగా చూపిస్తున్నారు.

భూమిని కొట్టేసేందుకు కుట్ర

మిగులు భూమిగా చూపించిన ఇక్కడ గ్రామంలో ఇళ్లులేని పేదలకు ఇంటిస్థలాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ భూమి గ్రామానికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఒకవేళ నిజంగా పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలనుకుంటే ఊరికి అనుకునే 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ఎంతమందికై నా ఇవ్వొచ్చు. అయినా ఈ భూమినే ఇవ్వాలనుకుంటున్నారంటే వారి ఉద్దేశం ఎంటో అర్థం చేసుకోవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ కూడా 20–30 ప్లాట్లు ఇచ్చి తక్కిన భూమిన గ్రామంలో ఉన్న కొందరు నాయకులు, మండలంలో కీలకంగా ఉన్న మరో నాయకుడు, ఓ రెవెన్యూ అధికారి భాగాలు పంచుకునేలా ప్రణాళిక రచించినట్లు ప్రచారం సాగుతోంది.

సర్వే నంబర్‌ 103–2, 103–3 గాజుబండ పొరంబోకు భూమిలో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. ఏడబ్ల్యూ ల్యాండుగా కన్వర్షన్‌ చేశారు. సాగు పట్టాలు కూడా ఇచ్చారు. పంటలు పెట్టుకుంటున్నాం. రుణాలు పొందాం. కరెంటు మీటర్లు ఉన్నాయి. మేము వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమనే కక్ష కట్టారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాకు అండగా నిలిచారు.

– ఎస్‌.పెద్ద ఓబులేసు, ఎస్‌.వసంతు

బాధితులు ఎస్‌.పెద్ద ఓబులేసు, ఎస్‌.వసంతులకు అండగా నిలుస్తాం. వైఎస్సార్‌సీపీ అభిమానులనే కక్షతో వారి భూములను లాక్కోవాలని చూస్తున్నారు. ఆ భూమిని కొట్టేసేందుకు పరిటాల కుటుంబం పూనుకుంది. పరిటాల సునీత, ఆమె సోదరుడు ధర్మవరపు మురళీ, స్థానిక నాయకులు, అధికారులు వాటాలుగా పంచుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం.

– తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం

బాధితులకు అండగా నిలుస్తాం

పుల్లలరేవులో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల భూమిపై టీడీపీ నేతల కన్ను

అధికారంలోకి రాగానే చెట్లు నరికివేత...తర్వాత పొలానికి నిప్పు

ఇప్పుడు ఏకంగా ఆన్‌లైన్‌ నుంచి పేర్ల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement