నేటి నుంచి ఏసీఏ ఉమెన్ కప్ ఇన్విటేషన్ క్రికెట్ టోర్న
● వివిధ రాష్ట్రాల నుంచి బరిలో దిగనున్న 8 జట్లు
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రికెట్ స్డేడియం వేదికగా ఏసీఏ ఉమెన్ కప్ ఇన్విటేషన్ క్రికెట్ టీ 20 టోర్నీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతపురం నుంచి రెండు జట్లు, బెంగళూరు యూఎస్‌ఏ అట్లాంట గర్‌ల్స్ టీం, విజయవాడ సంప్రసిద్ధి అకాడమీ, ఒంగోలు, కడప, చిత్తూరు జట్లు బరిలో దిగనున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ నెల 30వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. గురువారం బెంగళూరు అట్లాంట, విజయవాడ సంప్రసిద్ధ, అనంతపురం జట్లు ముమ్మర ప్రాక్టీస్ చేశాయి. ఏదిఏమైనా ఐదే రోజుల పాటు క్రికెట్ ప్రేమికులకు ఈ టోర్నీ కనువిందు చేయనుంది.
అందుబాటులోకి మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులు
● ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
● ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమర్
అనంతపురం టౌన్: జిల్లాలో మరో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి పారిశ్రామిక వేత్తలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. తాడిపత్రి మండలం ఊరుచింతల, కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామాల్లో ఒక్కొక్కటి 50 ఎకరాల్లో, కూడేరులో 100 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు ఏపీఐఐసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అలాగే https://apiic. in వెబ్‌సైట్ ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో కొన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలని కోరారు.
ఎద్దుల బండిని ఢీకొన్న కారు
● దూడ మృతి, రైతుకు తీవ్రగాయాలు
గుత్తి రూరల్: మండలంలోని వన్నేదొడ్డి గ్రామ శివారున 44వ జాతీయ రహదారిపై గురువారం ఎద్దుల బండిని కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. వన్నేదొడ్డికి చెందిన రైతు మల్లికార్జున తన పొలంలో వ్యసాయ పనులు ముగించుకుని ఇంటికి ఎద్దుల బండిలో వెళుతూ జాతీయ రహదారి దాటుతుండగా కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఎద్దుల బండికి వెనక కట్టిన ఆవు దూడ అక్కడికక్కడే మృతి చెందింది. బండి తునాతునకలైంది. తీవ్రంగా గాయపడిన మల్లికార్జునను స్థానికులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
మహిళ ప్రాణాలు కాపాడిన సబ్ స్టేషన్ ఆపరేటర్
బ్రహ్మసముద్రం: మండలంలోని రాయలప్పదొడ్డి గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ అప్రమత్తత ఓ మహిళను ప్రాణాపాయం నుంచి తప్పించింది. వివరాల్లోకి వెళితే... రాయలప్పదొడ్డి గ్రామానికి చెందిన త్రివేణి మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతోంది. గురువారం ఉదయం ఆమె పొరబాటున విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి ప్రవేశించింది. అక్కడి ట్రాన్స్‌ఫార్మర్లు, తీగలను పరిశీలిస్తూ ఓ తీగను పట్టుకోబోతుండగా గమనించిన సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ రంజిత్ వెంటనే ఆమెను పక్కకు లాగాడు. విద్యుత్ యార్డు నుంచి ఆమెను పక్కకు పిలుచుకొచ్చి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. విషయం తెలుసుకుని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు.. మహిళా ప్రాణాలను కాపాడిన రంజింత్‌ను అభినందించారు.
ప్రశాంతి నిలయంలో
క్రిస్మస్ సంబరం
ప్రశాంతి నిలయం: దేశ విదేశాలకు చెందిన సత్యసాయి భక్తుల నడుమ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేద పఠనం అనంతరం క్రిస్మస్ క్యారల్స్ ఆలపించారు. శాంతాక్లాజ్‌లు సందడి చేశారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజుతో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సభ్యులు క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నేటి నుంచి ఏసీఏ ఉమెన్ కప్ ఇన్విటేషన్ క్రికెట్ టోర్న


