● పునరుద్ధరిస్తే పూర్వవైభవం
● ప్రభ కోల్పోయిన జెడ్పీ తొలి కార్యాలయం
● 1952లో ఆవిష్కరించిన అప్పటి మద్రాసు సీఎం రాజగోపాలాచారి
● 1959 నుంచి కార్యాలయంలో కార్యకలాపాలు
● పునరుద్ధరిస్తే వినియోగంలోకి భవనం
అనంతపురం అర్బన్: జిల్లా పరిషత్ తొలి కార్యాలయంగా దశాబ్దాల పాటు విలువైన సేవలు అందించిన భవనం నేడు నిరాదరణకు గురై పిచ్చి మొక్కల మధ్యన నాటి వైభవానికి ఓ తీపి గుర్తుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోనే ఓ చివర ఈ భవనం నేటికీ చెక్కుచెదరకుండా నాటి వైభవాన్ని చాటుతోంది. కార్యాలయం ఎదురుగా ప్రహరీకి మూతపడిన గేటు దర్శనమిస్తుంది. 1952లో అప్పటి మద్రాసు ప్రభుత్వ ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ఈ భవనాన్ని ఆవిష్కరించారు. 1959లో అప్పటి జిల్లా బోర్డు అధ్యక్షుడు కె.వి.వేమారెడ్డి ఈ భవనం నుంచి పూర్తి కార్యకలాపాలు ప్రారంభించారు. భవనం నిర్మించి 66 ఏళ్లు అవుతున్నా.. రంగు కోల్పోయి అంద విహీనంగా కనిపిస్తోంది తప్ప... ఇప్పటికీ కట్టడం చెక్కుచెదరకుండా నాటి నిర్మాణ పని తీరుకు అద్దం పడుతోంది.
పునరుద్ధరిస్తే వినియోగంలోకి
జాతి సంపదగా నిలిచిన జిల్లా పరిషత్ తొలి కార్యాలయ భవనాన్ని పరిశీలిస్తే అంతులేని నిరాదరణ.. నిర్వహణ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. కట్టడం నేటికీ ఎంతో పటిష్టంగా ఉందనే విషయాన్ని ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. ఒక మంచి భవనం... అది కూడా మద్రాసు ప్రభుత్వ ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ఆవిష్కరించిన దానికి ఒక చరిత్ర ఉందనే విషయాన్ని అధికారులు, పాలకులు గుర్తించలేకపోవడం బాధాకరం. ఎంతో పటిష్టంగా ఉన్న ఈ భవనాన్ని పునరుద్ధరిస్తే భావితరాలకు ఎన్నో నాణ్యమైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది.
పాలకులు, అధికారులు దృష్టి పెట్టాలి
మన జాతి గొప్పది. మన శిల్పం గొప్పది. ఎన్నో అపురూప కట్టడాలను మన శిల్పులే తీర్చిదిద్దారు. వీటి గొప్పతనం మనది అని డంబాలు కొట్టడమే నేర్చుకున్న అధికారులు, పాలకులు.. మన పూర్వ కళాస్వరూపాలను చెక్కు చెదరకుండా కాపాడుకోలేకపోవడం బాధాకరం. జిల్లా పరిషత్ చరిత్రకు సాక్షంగా నిలిచే తొలి జెడ్పీ కార్యాలయానికి మునుపటి ప్రభను తీసుకొచ్చే విషయంపై ఇప్పటికై నా పాలకులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నారు.
● పునరుద్ధరిస్తే పూర్వవైభవం


