ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పు
అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఈ విద్యా సంవత్సరం నుంచి సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. సంస్కరణల్లో భాగంగా ఈ విద్యా సంవత్సరం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సిలబస్ మార్చిన సంగతి తెలిసిందే. పరీక్ష విధానంలోనూ నూతన విధానాలకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది.
ప్రశ్నపత్రంలో మార్పులు ఇలా..
● భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించి 85 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రస్తుత విధానంలో 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలతో పేపరు ఇస్తారు.
● గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, చరిత్ర, కామర్స్, రాజనీతి శాస్త్రం, ఎకనామిక్స్‌కు 32 పేజీలు, వృక్ష, జంతుశాస్త్రాలతో పాటు మిగిలిన సబ్జెక్టులకు 24 పేజీలున్న బుక్‌లెట్ ఇవ్వనున్నారు.
● భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో మొత్తం 85 మార్కులకు 29 వస్తే పాస్ అయినట్లే.
గణితం వంద మార్కులకే..
గణితం పేపర్ 1990 సంవత్సరంలో 150 మార్కులకు ఉండేది. తరువాత దీనిని గణితం–1ఏ, 1బీగా మారుస్తూ ఒక్కో పేపర్‌కు 75 మార్కులకు చొప్పున రెండు పేపర్ల విధానాన్ని ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. తాజాగా మొదటి ఏడాది విద్యార్థులకు గణితంలో ఒకే పేపర్‌ను 100 మార్కులకు నిర్వహించనున్నారు.
మార్పులకనుగుణంగా సన్నద్ధం
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా విధానంలో వచ్చిన మార్పులపై ఇప్పటికే ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు అవగాహన కల్పించాం. ఇప్పటికే మోడల్ పేపర్లతో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. మార్పులకనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం
– వెంకటరమణనాయక్, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి, అనంతపురం
బైపీసీలో బాటనీ, జువాలజీ కలిపి బయాలజీ
ఫిజిక్స్, కెమిసీ్ట్ర సబ్జెక్టులకు మార్కుల పెంపు
మ్యాథ్స్ వంద మార్కులు, బయాలజీ 85 మార్కులు


