అనూష ఆచూకీ కోసం రంగంలోకి డ్రోన్లు
బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్ప తన ఇద్దరు కుమార్తెలను తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో తోసేసిన విషయం తెలిసిందే. పెద్దమ్మాయి సింధు(11) మృతదేహం మంగళవారం లభ్యం కాగా, అదే రోజు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నమ్మాయి అనూష కోసం గాలింపు కొనసాగుతోంది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం కర్ణాటకలోని శిరిగేరి, మోకా, నాగేనహాళ్లి తదితర ప్రాంతాల్లో ఎల్లెల్సీపై బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబీరసూల్, పీఎస్‌ఐ నవీన్, సిబ్బంది డ్రోన్ కెమెరాలను వినియోగించారు. కాలువ వెంబడి గాలింపు కొనసాగుతోంది.
అప్పిరెడ్డి హరినాథరెడ్డికి
ఆటా ఎక్స్‌లెన్సీ అవార్డు
అనంతపురం కల్చరల్: రాయలసీమ సాంస్కృతిక వేదిక, యోగివేమన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలకుగాను జిల్లాకు చెందిన రచయిత, వ్యాసకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డికి ఆటా లిటరరీ ఎక్స్‌లెన్సీ అవార్డు దక్కింది. హైదరాబాదు వేదికగా ఈ నెల 27న రవీంద్రభారతిలో జరిగే ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వేడుకల ముగింపు ఉత్సవంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. అనేక ఏళ్లుగా సాగిస్తున్న సాహిత్య పరిశోధన, రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను వెలుగులోకి తెచ్చే మహా కవిసమ్మేళనాలు, పద్యపోటీలు, సీమ సాహితీ పోటీలు, తెలుగు భాషా వికాస కార్యక్రమాలు, సదస్సుల నిర్వహణ వంటివి ఆయనకు ఆటా పురస్కారం దక్కేలా చేశాయని నిర్వాహకులు చల్లా జయంత్, సతీష్‌రెడ్డి వెల్లడించారు.
‘అమిగోస్’ సీనరేజీ
కాంట్రాక్టు రద్దు
● గనుల శాఖ ఆధ్వర్యంలోనే పర్మిట్ల జారీ
● డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ
అనంతపురం టౌన్: సీనరేజీ, రాయల్టీ కాంట్రాక్టుల గడువు ముగియడంతో అమిగోస్ సంస్థ సీనరేజీ కాంట్రాక్టును రద్దు చేసినట్లు భూగర్భ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గనులశాఖ పరిధిలో రోడ్డు మెటల్, గ్రానైట్, క్వాట్జ్, గ్రావెల్, సున్నపురాయి, నాపరాయి తదితర ఖనిజ క్వారీల నుంచి సీనరేజీ, రాయల్టీల వసూళ్ల బాధ్యతను అమిగోస్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. ఈ కాంట్రాక్టు లీజు గడువు ముగియడంతో కాంట్రాక్టును రద్దు చేశారు. దీంతో రాయల్టీ పర్మిట్ల కోసం క్వారీల నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా గనుల శాఖకు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాల్సి ఉంటుంది. పర్మిట్లు లేకుండా ఖనిజాన్ని రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ అంశంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గనులశాఖ విజిలెన్సు బృందాలు విస్తృత తనిఖీలు చేపడతాయని డీడీ ఆదినారాయణ వెల్లడించారు. అక్రమ రవాణా చేస్తే క్వారీలను సీజ్ చేయడంతోపాటు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామన్నారు.
అనూష ఆచూకీ కోసం రంగంలోకి డ్రోన్లు


